ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యాక చంద్రబాబుకు పార్టీ పరంగా భలే ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పార్టీని రెండు ప్రాంతాల్లోనూ కాపాడుకోవాలి. అలాగే రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడ తేడా వచ్చినా పార్టీ అవుట్. అయితే రెండు చేతులూ ఒకటే అయినా కుడి చేయికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నట్టు టీడీపీకి ఆంధ్రా అంటే కాస్త ఎక్కువ ప్రయారిటీ.

అందులోనూ అక్కడ అధికారంలో ఉంది కదా. అందుకే పదవుల పంపకాల్లో కాస్త తెలంగాణవారికి కూడా అవకాశం కల్పించి ఉదారత చాటుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే అధికారం అందుకున్న తొలిరోజుల్లోనే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు టిటిడిలో స్థానం కల్పించి శభాషనిపించుకున్నారు. జీ సాయన్న, సండ్రవెంకట వీరయ్యలకు టీటీడీ మెంబర్ షిప్ ఇచ్చారు. 

అయితే ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి.  గులాబీ పార్టీ ఆకర్ష మంత్రానికి సాయన్న దాసోహం అన్నారు. పార్టీ మారిపోయారు. సండ్ర వెంకటవీరయ్య మాత్రం కొనసాగుతున్నారు. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. తాజాగా సాయన్నపై తన ప్రతీకారం తీర్చుకున్నారు. టీటీడీ మెంబర్ షిప్ ను రెన్యువల్ చేయకుండా ఆపేశారు. 

ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక్క సండ్ర మాత్రమే టీటీడీ మెంబర్ గా ఉన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాలపరిమితిని మరో యేడాది పాటు పొడగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సమయంలో ఈ మార్పులు చేశారు. ఇప్పుడు సాయన్న స్థానంలో ఆ పదవి ఏ తెలంగాణనేతకు దక్కుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: