ఎక్కడ చూసినా భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో భూదందాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. అందులోనూ అది ప్రభుత్వ స్థలమైతే ఇక చెప్పే పని లేదు. అలాంటి సమయాల్లో సర్కారీ స్థలాలను కాపాడటం గగనమైపోతోంది. అలాంటప్పుడు కాపాడాల్సిన కంచే చేను మేస్తే..ఇక చెప్పేదేముంది. 

అనంతపురం జిల్లాలోని జేఎన్‌టీయూ భూముల విషయంలో ఇదే జరుగుతోంది. ఏకంగా యూనివర్శిటీకి చెందిన ఉద్యోగులే వీటికి కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. యూనివర్శిటీకి చెందిన దాదాపు ఆరు ఎకరాలను ఆక్రమించుకునేందుకు పక్కా ప్రణాళిక అమలు చేశారు. విషయానికి వస్తే.. అనంతపురంలోని జేఎన్టీయూకు ప్రభుత్వం దాదాపు 350 ఎకరాలు కేటాయించింది. 

ఆ తర్వాత ఆ భూముల్లోనే పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయడంతో ఆ కాలేజీకి వంద ఎకరాలు కేటాయించారు.  మిగిలిన 250 ఎకరాల్లోనూ 36 ఎకరాలని వివిధ ప్రభుత్వ సంస్థలకు కేటాయించారు. ఈ సమయంలోనే యూనివర్శిటీ ఉద్యోగులు కొందరు అతి తెలివి ప్రదర్శించారు. కేవలం 30 ఎకరాలు మాత్రమే వివిధ సంస్థలకు బదలాయించి మిగిలిన ఆరు ఎకరాలను వదిలేశారు. 

ఆ ఆరు ఎకరాలు జేఎన్టీయూ భూములు కావన్న రీతిలో ప్రచారం సాగించారు. సంస్థ ఉద్యోగులే చిన్న చిన్న గుడిసెలు వేయించి ఆ ఆరు ఎకరాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూదందాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. దీంతో యూనివర్శిటీ యాజమాన్యం మేలుకొంది. కబ్జా పర్వం వెనక ఉన్న ఉద్యోగులను గుర్తించే పనిలో పడింది. అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని యూనివర్శిటీ రిజస్ట్రార్ కృష్ణయ్య మీడియాకు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: