మీడియా, అధికారం.. ఈ రెండింటి మధ్యా ఆధిపత్యపోరు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అధికారం కోసం తాపత్రయపడే నాయకుడు బలహీనంగా ఉంటే మీడియా అతడిని ఓ ఆటాడుకుంటుంది. అతనిపై పెత్తనం చెలాయిస్తుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకుడు బలంగా ఉంటే..అతడు మీడియాను ఓ ఆటాడుకుంటాడు. తన చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. 

ఇప్పుడు తెలుగు నేలపై ఇదే జరుగుతోంది. ఇటు ఆంధ్రాలోనూ, అటు తెలంగాణలోనూ మీడియాపై పెత్తనం కోసం ముఖ్యమంత్రులు తహతహలాడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందే ఉన్నారు. నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన్ను ఎదిరించే మీడియా లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. 

ఇప్పటికే చంద్రబాబు తనకు వ్యతిరేకంగా కథనాలు ఇస్తున్న ఎన్టీవీని ఓసారి బెదిరించారు. కొన్నాళ్లపాటు ప్రసారాలు రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎన్టీవీ రాజీకి వచ్చింది. మళ్లీ ఎన్టీవీ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఎన్టీవీలో ఉదయం వేళ ప్రసారమయ్యే ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్సార్ లైవ్ షోపై తెలుగు దేశం నేతలు కోపం పెంచుకున్నారు. ముందు వార్నింగ్ ఇచ్చారు. 

పసుపు దళం హెచ్చరికల ఫలితంగా ఎన్టీవీ యాజమాన్యం తలొగ్గింది. ఉన్నట్టుండి కేఎస్సార్ లైవ్ షో ను తాత్కాలికంగా ఆపేసింది.  ఈ పరిణామం మీడియా వర్గాల్లో కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఇంకా ప్రభుత్వ పెద్దలతో ఎన్టీవీ యాజమాన్యం చర్చలు జరుపుతోందని.. అవి ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ఈమేరకు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన ఓ ప్రకటనే ఇందుకు సాక్ష్యంగా మారింది. అంటే ఇంకా ఎన్టీవీని చంద్రబాబు బెదిరిస్తూనే ఉన్నారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: