ప్రభుత్వాలకు వార్తాపత్రికలు, ఛానళ్లకూ ఘర్షణ అన్నది కొత్త విషయమేమీ కాదు. ఇక తెలుగు నేలపై ఇది నిత్యం జరుగుతున్న తంతే.. ఆనాడు వైఎస్ ఆ రెండు పత్రికలు అంటూ రచ్చ చేయడం.. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ టీవీ9, ఆంధ్రజ్యోతిలపై కత్తి ఎత్తడం అందరికీ తెలిసిన విషయాలే. ఇది నిరంతరం కొనసాగుతున్న వ్యవహారమే. 

ఐతే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. ప్రభుత్వాలు, మీడియా సంస్థల మధ్య వైరం విషయానికి వస్తే అది మీడియా సంస్థల అధిపతులకు, ప్రభుత్వాధిపతులకూ మధ్య జరుగుతున్న ఘర్షణగానే చెప్పుకోవాలి. కానీ ఎప్పుడూ అధికారంలో ఉన్న వారు ప్రత్యేకించి ఓ జర్నలిస్టుపై దృష్టి కేంద్రీకరించి ఇబ్బందులుపాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. 

కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకించి ఓ జర్నలిస్టుపై పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. ఆయనే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన తన లైవ్ డిస్కషన్లలో టీడీపీకి వ్యతిరేకంగా జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నేతల వాదన. అందుకే ఎన్టీవీ యాజమాన్యంపై పట్టుబట్టి ఒత్తిడి తెచ్చి ఆ లైవ్ డిస్కషన్ ను ఆపేయించారు. 

ఇలా ఓ జర్నలిస్టు కార్యక్రమాన్ని ఆపేయించడం.. ఆ టీవీ ప్రసారాలు కొనసాగించడం చూస్తే.. కొమ్మినేని శ్రీనివాసరావుకు చంద్రబాబు సర్కారుకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. కొమ్మినేని కేవలం ఓ జర్నలిస్టు. కేవలం ఒక్క ప్రోగ్రామ్ మాత్రమే చేస్తున్నాడు. ఆయన ఒక్కడు సర్కారు వ్యతిరేక వైఖరి అవలంభిస్తే పోయేదేముంది.. పనిగట్టుకుని అతని ప్రోగ్రామును ఆపేయించాల్సినంత అవసరం ఏముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

చంద్రబాబు సర్కారు వైఖరిపై స్పందించిన కొమ్మినేని.. ఎన్టీవీ యాజమాన్యంపై టీడీపీ ఒత్తిడి తెచ్చిందని స్పష్టం చేశారు. ఐతే.. ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అదికారబలం ముందు వ్యక్తులు నిలబడడం కష్టమని కామెంట్ చేశారు. అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని తాను భావిస్తానన్నారు. 

ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్ర స్థానంలో ఉన్నవారు భయపడతారా అనుకునే వాడినిని.. వాడి ఉద్యోగం తీయించుతారా అని అనుకుంటుండేవాడినని ఇప్పుడు తనకే ఆ పరిస్థితి వచ్చిందని కామెంట్ చేశారు. పరిస్థితులు మారతాయని, అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నానని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: