వైసీపీను అర్జంటుగా ఖాళీ చేసేయాలి.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో వీలైనంత మందిని ఆకర్షించాలి. ప్రతిపక్షమన్నది లేకుండా చూసుకోవాలి.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు కొన్నాళ్లుగా చేస్తున్న ప్రధాన కార్యాల్లో ఒకటి. ఆ విషయంలో ఆయన అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 16 మందికి పైగా ఎమ్మెల్యేలను ప్రతిపక్షం నుంచి ఆకర్షించగలిగారు. 

బాగానే ఉంది. వలసలతో పార్టీ బలపడుతుంది. ఎదుటి పార్టీ బలహీన పడుతోంది. ఐతే.. ఇక్కడో చిక్కుముడి ఉంది. ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అంటే గత ఎన్నికల్లో టీడీపీపై నెగ్గినవాడేగా.. మరి అతన్ని పార్టీలోకి ఆహ్వానిస్తే.. ఇప్పటికే అక్కడ అతనిపై ఓడిపోయిన టీడీపీ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ పరిస్థితి ఏంటి.. వీరిద్దరికీ గ్రూపు తగాదాలు రాకుండా ఉంటాయా.. 

ఐతే.. ఇంత సిల్లీ ఐడియా చంద్రబాబుకు రాకుండా ఉంటుందా.. సమస్యే లేదు. కానీ ఇందుకు చంద్రబాబు వద్ద ఉన్న ఆయుధం ఏంటంటే.. ఎలాగూ అసెంబ్లీ సీట్ల సంఖ్య మరో 50 వరకూ పెరుగుతుంది. అప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని అడ్జస్టు చేయవచ్చు అనేది. కానీ ఈ ప్లాన్ పేపర్ పై బాగానే ఉన్నా.. ఇంప్లిమెంట్ లో అంత ఈజీ ఏమీ కాదు..

ఉదాహరణ చెప్పాలంటే.. నంద్యాల నియోజకవర్గం విషయం తీసుకుంటే ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి... ఇప్పటికే అక్కడ పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరులకూ జగడం ఉంది. భూమా  చేరిక సమయంలోనే శిల్పా సోదరులు అభ్యంతరం చెప్పారు. చంద్రబాబు వారికి ఎలాగోలా సర్థిచెప్పారు. కానీ అక్కడ టీడీపీది కలహాల కాపురంగానే సాగుతోంది.

పదిరోజులకోసారి పంచాయితీ సీఎం వద్దకు వెళ్తోంది. వారి మధ్య సయోధ్య కుదర్చడం బాబుకు తలనొప్పిగా మారింది. మరి ఎన్నికలు దగ్గరకు వస్తే.. ఇలాంటి తలనొప్పులు ఇంకెన్ని వస్తాయో.. వాటిలో చంద్రబాబు ఎన్ని తీరుస్తారో.. సో.. ఇక ముందు చంద్రబాబుకు తలనొప్పులు మరింత తీవ్రం అవుతాయన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: