రాజకీయాల్లో ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ముందు సైకలాజికల్ గా అతన్ని దెబ్బ తీయాలి. అందుకు అతని సొంత ప్రాంతంలో దెబ్బ కొట్టడం ఓ మార్గం. సొంత జిల్లాలోనే సత్తా చూపలేని వాడు రాష్ట్రంపై ఏం చూపుతాడన్న వాదన తీసుకురావచ్చు.. ఇదీ చంద్రబాబు వ్యూహం.. అందుకే ఆయన కడప జిల్లాపై ఇటీవల ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. 

ఐతే.. కడప జిల్లా వైసీపీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం ఒకే ఒక్కస్థానం దక్కింది. మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఆ తర్వాత బాబు ఈ జిల్లాపై దృష్టి సారించి ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఓ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగారు. కడప జిల్లాలో ఇదే జోరు టీడీపీ కొనసాగించాలని బాబు ఆశపడ్డారు. 

కానీ.. అందుకు అనువైన పరిస్థితులు కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందా అన్న అనుమానంతో చంద్రబాబు కడప జిల్లా రాజకీయ నేతలపై ఇంటలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నారట. ఈ నివేదికలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయట. ఇక్కడ వైసీపీ బలంగా ఉండటం ఆ పార్టీ గొప్పదనం కాదట. కడప జిల్లా టీడీపీలో ఉన్న విపరీతమైన గ్రూపులే ఆ పార్టీ బలహీనపడటానికి కారణాలట. 

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు షాక్ అయ్యారట. కడప జిల్లాలో ఉన్నవి పది నియోజకవర్గాలైతే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో ముప్పై గ్రూపులున్నాయట. ఒక్క కడప నగర టీడీపీలో ఏకంగా 10 గ్రూపులున్నాయట ! రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరులలో రెండేసి గ్రూపులు ఉన్నాయట. 

వీటిని ముఖ్యమంత్రి డీప్‌గా స్టడీ చేసిన మీదటే కడప జిల్లా నేతలపై తరచుగా కన్నెర్రజేస్తున్నారట. పార్టీ అధినేతే స్వయంగా కడప జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మాట వాస్తవం. జిల్లా అభివృద్ధితోపాటు పార్టీలో సమన్వయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ సొంత జిల్లాలో తెలుగుదేశం నేతల తీరు మారుతుందో లేదో వేచి చూడాలి...!



మరింత సమాచారం తెలుసుకోండి: