తెలంగాణ కొత్తగా కడతానంటున్న ప్రాజెక్టులు ఆంధ్రా, తెలంగాణ మధ్య గొడవలకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ ఆంధ్రా, తెలంగాణగా విడిపోయిన తొలి రోజుల్లో ఇలాంటి గొడవలు బాగా జరిగాయి. నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించేవరకూ పరిస్థితి వెళ్లింది.. ఇక సెక్షన్ 8, ఓటుకు నోటు వంటి కేసులు కూడా రెండు రాష్ట్రాలను వేడెక్కించాయి.

ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ గొడవలన్నీ ఆగిపోయాయి. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ స్నేహగీతం ఆలపించడం మొదలుపెట్టారు. ఈ చంద్రుల అనుబంధం చూసి లోకమంతా ముచ్చటపడింది. కానీ ఈ ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ తలపెడుతున్న కొత్త ప్రాజెక్టులు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేలా ఉన్నాయి. 

ఓవైపు కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని జగన్ దీక్షకు దిగాడు. దీంతో ఉలిక్కిపడిన చంద్రబాబు.. ఆ క్రెడిట్ జగన్ కు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేబినెట్ మీటింగులో తెలంగాణ అనుమతి లేని ప్రాజెక్టులు కడుతోందంటూ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతోంది. సో.. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా పార్టీలు ఒక్కటవుతాయేమో చూడాలి. 

కేసీఆర్ మాత్రం.. ఆంధ్రా జలదోపిడీ విషయంపై తెలంగాణ నేతలంతా ఒక్కటి కావాలని పిలుపు ఇస్తున్నాడు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులంతా ఒక్కటవుతున్నారని.. ఈ సమయంలో తెలంగాణ నాయకులు, పార్టీలంతా ప్రజల పక్షాన నిలవాలని పిలుపు నిచ్చారు. 

కేబినెట్ తీర్మానంతో చంద్రబాబు వంకరబుద్ధి బయటపడిందని.. ఆంధ్రా జల దోపిడీ చేసి.. గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్‌కు తరలిస్తోందని కేసీఆర్ అంటున్నారు. తాము కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కడుతున్నామని.. వాటి వద్ద పడుకొనైనా కట్టిస్తానంటున్నాడు తెలంగాణ నీటి మంత్రి హరీశ్‌ రావ్. మరి ఈ ప్రాజెక్టుల గొడవలకు ఎక్కడదాకా వెళ్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: