తెలంగాణ కొత్తగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఆరు నూరైనా ప్రాజెక్టులు నిర్మించితీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెబుతున్నారు. ఐతే.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. అంతగా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది. 

ఏపీ క్యాబినెట్ తీర్మానంపై ఇప్పుడు తెలంగాణలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరవై ఏండ్లుగా అరిగోస పడుతున్న తెలంగాణ రైతాంగానికి నీళ్లిచ్చి వ్యవసాయాన్ని బతికించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ చేస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరింస్తున్నారంటూ తెలంగాణవాసులు మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రాజెక్టులపై న్యాయపోరాటం చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానం.. 


ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అంతటా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బాబు వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఇంకొందరు మరీ ముందుకు వెళ్లి రాష్ట్రం విడిపోయినా బాబు దెయ్యంలా వెంటాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. 
బాబు తీరు మార్చుకోవాలంటున్నారు. 

మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా చంద్రబాబువైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గద్వాలలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: