హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఏపీ సచివాలయ ఉద్యోగులకు అదనంగా 30 శాతం హెచ్ఆర్ ఏ తోపాటు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలన్న సౌలభ్యాన్ని కూడా ఏపీ సర్కారు కల్పించింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగుల ఇబ్బందుల పట్ల సానుకూలంగా స్పందించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొందరు ఉద్యోగులు అమరావతికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అమరావతికి వెళ్లే బదులు ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టి వేరే ఉద్యోగాన్ని చూసుకోవడం మేలు అంటున్నారు ఏపీ సచివాలయ ఉద్యోగులు.

 

ఎందుకంటే, కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో అన్ని రకాలుగా స్థిరపడ్డ తర్వాత ఇప్పుడు వాటన్నింటినీ వదులేసుకొని అమరావతికి రమ్మంటే ఎలా కుదురుతుందని వారు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, కొన్న ఇల్లు, స్థిరాస్తులను వదిలేసి ఉన్న పలంగా అమరావతికి రమ్మంటే ఎలా సాధ్యం అవుతుందని వాళ్లు వాపోతున్నారు. దీనికన్నా బదులు ఏపీ రాజధానికి వెళ్లి ఉద్యోగం చేసే కన్నా.. వీఆర్ఎస్ తీసేసుకొని.. ఇంకేదైనా పని చూసుకుంటే మంచిదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు.

 

ఈ వాదనకు తగినట్లే కొందరు ఏపీ సచివాలయ ఉద్యోగులు తమ వీఆర్ఎస్ అప్లికేషన్లు ప్రభుత్వానికి పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ పది మంది వరకూ ఇలా వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని.. రానున్న మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: