తెలంగాణ రాష్ట్రంలో దారుణ‌మైన క‌రువు ప‌రిస్థితులు ఉన్నాయి. పిల్ల‌ల్ని క‌ర‌వు కోరలోంచి ర‌క్షించాల‌ని నోబెల్ గ్ర‌హీత , బాల‌ల హక్కుల ఉద్య‌మ కారుడు కైలాశ్ స‌త్యార్ధి అన్నారు. నిన్న న్యూ ఢిల్లీ లో మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ఆయ‌న పై విధంగా స్పందించారు. వాస్త‌వానికి ధ‌నిక రాష్ట్రంగా పిలువ బడుతున్న క‌రువు విల‌య‌తాండ‌వం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న క‌రవుల‌తో వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో హైదరాబాద్ కు వ‌ల‌స వ‌చ్చేవారి సంఖ్య పెరిగింది. ఉపాధి దొర‌క‌క విల‌విల‌లాడుతున్నారు. కొత్తగా ఏర్ప‌డ్డ స‌ర్కార్ స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై తాత్సారం చేస్తోంది. నిజానికి  తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 న ఏర్ప‌డింది. అట్ట‌డుగు వ‌ర్గాల్లో ఎన్నో ఆశ‌లు రేపింది. ఆనాటి నుంచి తమ ఆశ‌లు తీరుతాయ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు క‌ల‌లు క‌న్నారు. దేశంలోని రెండో అత్యంత ధనిక రాష్ట్ర‌మ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు చెబుతుంటే తెలంగాణ ప్ర‌జ‌లు ఎంతో సంతోషించారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా ఉంది. క‌ర‌వు ర‌క్క‌సి తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల్ని పీక్కుతింటున్న‌ది. తాగేందుకు నీరు కూడా దొర‌క‌ని దుర్భ‌ర ప‌రిస్థితుల్లో తెలంగాణ గ్రామీణ ప్ర‌జానీకం బ‌తుకుతున్నారు.


వాస్త‌వానికి కైలాస్ స‌త్యార్థి స్పంద‌న ప్ర‌కారం గ‌మ‌నిస్తే,  తెలంగాణ ను క‌రువు క‌మ్మేసింది. వాన‌లు లేక పాతాళానికి భూగ‌ర్భ‌జ‌లాలు ప‌డిపోయాయి.  ఖ‌రీఫ్ లో 14 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట న‌ష్టం వ‌చ్చింది. అలాగే రబీ పంట‌లు రైతు క‌ళ్ళెదుటే ఎండిపోతున్నాయి. దీనికి తోడు నిలువున ముంచిన దుర్భిక్షం. ప‌శువుల్ని క‌బేళాల‌కు పంపిస్తున్నారు. పంపు సెట్ల‌ను  అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఫ‌లితంగా గ్రామాల‌లో ప‌నులు లేక వ్య‌వ‌సాయ కార్మికులు, చిన్న, స‌న్న కారు రైతులు, వృత్తి దారులు వ‌ల‌స‌బాట ప‌ట్టారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా రైతులు ప‌డుతున్న  ఆవేద‌న క‌న్నీళ్ళు తెప్పిస్తుంది. 3 పంట‌లు పంట పండే నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతులు, భీమా కింద ఉన్న రైతులు, శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టు జలాల‌లో అత్య‌ధిక దిగుబ‌డుల‌తో ధాన్యాగారంగా పేరొందిన క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇప్పుడు క‌రువు తాండవిస్తోంది. బిక్కు బిక్కు మంటు ప‌ట్నం బాట ప‌ట్టారు. గ్రామాల‌లో ట్యాంక‌ర్ వ‌స్తే త‌ప్ప  తాగునీరు లేని ప‌రిస్థితి. వ‌ర్షాలు ప‌డ‌లేదు కాబ‌ట్టి క‌రువు ఉంద‌ని దేవుడు క‌నిక‌రించ‌లేద‌ని, ఆ పాపం మాదికాద‌ని గ‌త పాల‌కుల‌ద‌ని కొంద‌రు ప్ర‌జ‌ల‌ను న‌మ్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 36 మండ‌లాల‌లో సైతం క‌రువు ప‌రిస్థితులు ఉన్నాయి. పూట గ‌డ‌వ‌టం క‌ష్ట‌మై వ్య‌వ‌సాయ కూలీలు, రైతులు హైద‌రాబాద్, పూణే, ముంబాయి, బెంగుళూర్ తదిత‌ర న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్ళుతున్నారు. ప‌శు గ్రాసం కొర‌త తీవ్రంగా ఉంది. 


ఇక‌పోతే న‌ల్ల‌గొండ జిల్లాలో దుర్బిక్ష ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాగునీటికే జ‌నం క‌ట‌క‌ట లాడిపోతుంటే కొద్ది పాటి నీటి వ‌న‌రులు ఉన్న చోట వేసిన పంట‌లు మండే ఎండ‌ల‌కు మాడిపోతున్నాయి. జిల్లాలో పేరు గాంచిన కొండ మ‌ల్లేప‌ల్లి ప‌శువుల సంత నుంచి ప్ర‌తివారం వేల సంఖ్య‌లో పాడి గేద‌లు, ఎద్దులు, ఆవులు క‌బేళాల‌కు తర‌లిపోతున్నాయి. జనం వ‌ల‌స బాట పట్టారు. మెదక్ జిల్లాలో మంజీర న‌ది పూర్తిగా ఎండిపోవం, భూగ‌ర్భ జ‌లాల మ‌ట్టాలు దారుణంగా ప‌డిపోవడం వ్య‌వ‌సాయాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. పత్తి, మొక్క‌జోన్న పంట‌లు ఎక్కువ న‌ష్ట‌పోయాయి. 46 మండ‌లాల‌ను క‌రువు మండ‌లాలుగా ప్ర‌క‌టించ‌డం ప‌రిస్థితి తీవ్రత‌కు అద్దం పడుతోంది. మ‌హాబూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిస్థితి  మరీ దారుణం. ఖ‌రీప్ లేదు, ర‌బీ లేదు, జిల్లాలో 600 నుంచి 800 అడుగుల‌లోతు బోరు వేసినా చుక్క నీరు క‌నిపించ‌డంలేదు. ల‌క్ష‌ల మంది బొంబాయి, పూణే, హైదరాబాద్ న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లో ప‌త్తి ప్ర‌ధాన పంట‌. ఆ త‌రువాత సోయా పండిస్తున్నారు. ఖ‌రీఫ్ లో 92 వేల హెక్టార్ల‌లో సాగుచేశారు. వ‌ర్షాలు లేక‌పోవ‌డం, తెగుళ్ళు రావ‌డంతో సోయా దిగుబ‌డి ప‌డిపోయింది. గ్రామాలను క‌రువు ఆవ‌హించ‌డంతో పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోనే 30 నుంచి 40 ల‌క్ష‌ల మంది వ‌ల‌స వ‌చ్చార‌నేది ప్రాద‌మిక అంచ‌నా.


వీరు ప్ర‌ధానంగా భ‌వ‌న నిర్మాణం, ఆటో డ్రైవ‌ర్లు, షాప్ వ‌ర్క‌ర్లు, హోట‌ల్ వ‌ర్క‌ర్లు వంటి రోజువారి ప‌నులు చేసుకుంటున్నారు. వీరికి గుత్తెదారులు డ‌బ్బులు ఇవ్వ‌కుండా ఎగొట్టిన సంద‌ర్భాలు అనేకం. వీరు నివ‌సిస్తున్న ప్రాంతాల‌లో మూసికి ఇరువైపుల ఉంటూ మ‌రియు ప‌ట్ పాత్ ల‌పై నివ‌సిస్తున్నారు. ఒకే ద‌గ్గ‌ర వంద‌లాది మంది ఉంటున్నారు. మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు కూడా లేవు. ముంచినీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. న‌గ‌రంలో కూడా ప‌ని సరిగ్గా దొర‌క‌డం లేదు. కూలీల మ‌ధ్యే పోటి పెరిగింది. ఫ‌లితంగా కూలిరేట్ త‌గ్గించి ఇస్తున్నారు. ఇందుకు కారణం గ‌తంలో ప‌రిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల‌దేన‌ని అధికార టీఆర్ఎస్ ప‌దే ప‌దే చెప్పుకుంటుంది. కానీ, ధ‌నిక రాష్ట్ర‌మ‌ని అదే నోటితో గట్టిగానే వారిస్తున్నారు. ధ‌నిక రాష్ట్రాన్ని సాధించి 2 సంవ‌త్స‌రాలే అయ్యింది. మ‌రి క‌రువు వ‌ల‌స‌లు వీటితో ప్ర‌జ‌లు ఎందుకు అల్లాడుతున్నారు. అంటే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర జ‌వాబు లేదు.  మేధావులు, రాజ‌కీయ పార్టీలు, ప్ర‌తి తెలంగాణ పౌరుడు క‌రువు పై ప్ర‌భుత్వానికి ముందు చూపు లేకుండా పోయిందా అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. ఒక వైపు అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు, మ‌రోవైపు గుక్కెడు నీటి కోసం కిలోమీట‌ర్ల దూరం వెళ్ళాల్సి వ‌స్తోంది. ప్ర‌ధానం గా గిరిజ‌నులు, ద‌ళితులు, వెన‌క‌బ‌డిన కులాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఈ బాద‌ల‌ను అనుభ‌విస్తున్నారు. 


పాల‌కుల నిర్ల‌క్ష్యం ముందు చూపు అంచ‌నా వేయటంలో వైఫ‌ల్యం స్ప‌ష్టంగా ఉన్న‌ది. క‌రువు మండ‌లాలు గుర్తించ‌డం ఎంత అల‌సత్వం వ‌హిస్తుందో అర్దమౌతుంది. ఈ క‌రువు గూరించి అంచ‌నాకు ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు మరియు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు మందే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయినా ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్టింది. ఈ 22 నెల‌ల కాలంలో  ఏదో ఒక ఎన్నిక‌లు తీసుకోచ్చింది. అందులో నానా ర‌కాలుగా గ‌డ్డితిని ఎన్నిక‌ల‌లో గెలుపు కు ఇస్తున్న ప్రాధాన్య‌త ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం మాత్రం తాత్సారం చేస్తోంది. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే సరిగ్గా గుర్తించ‌డంలోనే ఈ పాల‌కుల దొంగ నాట‌కం అర్థ‌మౌతుంది. గ‌త అనుభావాల‌ను తీసుకుంటే  ఈ పాపం జ‌ర‌గ‌కుండా కొంతైనా నివారించ‌వ‌చ్చు. అనుభ‌వాల‌ను తీసుకోక‌పోగా ఈ క‌రువు మ‌న రాష్ట్రంలోనే లేదు. దేశం మొత్తం ఉంది కేసీఆర్ సెల‌విచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే కొన్ని చర్య‌లు చేప‌ట్టాలి. ప్ర‌ధానంగా గ్రామీణ ఉపాధి హామి ప‌థ‌కం ను 360 రోజులుగా ప్ర‌క‌టించాలి. అలాగే క‌నీస కూలీ 300 రూపాయ‌లు చెల్లించాలి. ఉపాధి హామీ పనులు చేసిన వారికి అన్ని జిల్లాల‌లో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మండ‌ల కార్యాల‌యాల ద‌గ్గ‌ర ధ‌ర్నాలు జ‌రుగుతున్న ప‌రిస్థితి చూస్తున్నాము. ఆందుకోసం వెంట‌నే పెండింగ్ బిల్లు చెల్లించాలి. 


గ్రామాల‌లో ఆస‌రా ప‌థ‌కం కింద ఇస్తున్న పెన్ష‌న్ 1000 రూపాయ‌ల‌లో ఇంటి ప‌న్ను 500 రూపాయ‌లు క‌ట్టుకుని మిగిలింది ఇస్తున్నారు. ప‌న్ను క‌ట్ట‌క‌పోతే న‌ల్లా క‌నెక్ష‌న్, డ్రైనేజి క‌నెక్ష‌న్ నిలిపివేస్తున్నారు . ఇలాంటి చర్య‌ల‌ను పాల‌కులు నిలువ‌రించాలి. ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున ర‌క్ష‌ణ సామాగ్రి అందుబాటులోకి ఉంచాలి. టెంట్, మంచినీరు. ప్ర‌థ‌మ చికిత్స కు సంబంధించిన ప‌రిక‌రాలు, ప‌శుగ్రాసం కొనుగోలు చేసి రైతుల‌కు స‌ర‌ఫ‌రా చేయాలి. మంచినీరు ప్ర‌జ‌ల‌కు అందించకుండా బీర్ కూల్ డ్రింక్ కంపెనీల‌కు అందించ‌డం విడ్డూరం. మండే ఎండ‌ల‌కు పిట్టల్లాగా ప్రాణాలు పోతున్నాయి.నోబెల్ గ్ర‌హిత కైలాస్ స‌త్యార్థి చెప్పిన విధంగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి. వేలాది మంది చిన్నారుల‌పై క‌రువు ప్ర‌భావం ఉంద‌ని, ఆ ప్రాంతాంలో కేంద్ర అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను ప్ర‌క‌టించాలి. ఈ విష‌యం దేశ‌ప్ర‌ధాని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి దృష్టి పెట్టాలి.  వైద్యం అందుబాటులోకి ఉంచాలి. ఇవి కాకుండా దీనితో పాటు అడవుల‌ను ర‌క్షించుకోవ‌డం, ప్రాధాన్య‌త క్ర‌మంలో ప్రాజెక్టుల‌ను పూర్తి చేయడం చేయాలి. అప్పుడే ప్ర‌జ‌లు పాల‌కుల మాట‌ల‌కు విలువ‌నిస్తారు. గౌర‌విస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: