జూన్ 2 నాటికి హైదరాబాద్ లో మెట్రో పరుగులు తీస్తుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలే కానున్నాయా.. మెట్రో పట్టాలెక్కాలంటే్ ఇంకా చాలా సమయం పడుతుందా.. ఇంతకీ మెట్రో ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఎప్పడు అనేది స్పష్టంగా తెలియకపోయినా.. జూన్ 2 నాటికైతే మెట్రో పరుగులు అసాధ్యమని ఎల్ అండ్ టీ కంపెనీ తేల్చి చెప్పేసింది.  

మెట్రో కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ మహానగర ప్రజలు ఈ ప్రాజెక్టు పూర్తి కోసం కనీసం మరో రెండున్నర సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండు నాటికి తొలి దశ మెట్రో అందుబాటులోకి తీసుకురావాలన్న కేసీఆర్ కలలు కల్లలేనని ఎల్ అండ్ టీ చెప్పేసింది. కేసీఆర్, కేటీఆర్ సహకరిస్తున్నా.. వివిధ కారణాల వల్ల మెట్లో ఆలస్యం అవుతోందని చెబుతోంది ఎల్ అండ్ టీ. 

మెట్రో కలలు.. మరింత ఆలస్యం.. 


2018 డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవ‌కాశం ఉన్నట్లు ఎల్ అండ్ టీ ఎండీ వీఎన్ గాడ్గిల్ వివరణ ఇచ్చారు. తన 40 ఏళ్ల వృత్తి జీవితంలో నిర్ణీత సమయం కన్నా ఆలస్యమైన ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో మాత్రమేనని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తున్నప్పటికీ... చాలా విషయాల్లో ప్రభుత్వం మరింత జొర చూపాల్సి ఉందన్నారు గాడ్గిల్. 

వాస్తవానికి 72 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మొత్తం ప్రాజెక్టును 2017 జూలై నాటికల్లా పూర్తిచేసి మెట్రో రైలును పరుగు పెట్టించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత కూడా వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం బాగా ఆలస్యమైంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వివిధ అడ్డంకుల కారణంగా గడువును కనీసం 18 నెలలు పెంచాలని, దాంతోపాటు రూ. 3వేల కోట్ల పరిహారం కూడా ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: