తెలంగాణలో టీడీపీ చావు దెబ్బ తిన్నది. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు ఇద్దరో ముగ్గురో మిగిలారు. ఐనా.. తెలంగాణాలో తిరిగి తెలుగుదేశానికి పూర్వ వైభవం ఖాయమంటున్నారు టీడీపీ నాయకులు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం సాగింది. 

తెలంగాణా తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి.. మోత్కుపల్లి నర్శింహులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ పటిష్టత, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టడం, తెలుగుదేశం బృందం చేపట్టిన కరవు యాత్రలు, పార్టీ సంస్ధాగత నిర్మాణం, మొదలైన అంశాలపై సమావేశంలో చర్చించారు. 

ఈ సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు కనపడింది. కేసీఆర్ పై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. స్వార్ధంతో  పలువురు నేతలు పార్టీని వీడినా....అధైర్యపడవద్దని.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్దంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఎవరికి సంక్షేమ ఫలాలు అందటం లేదని విమర్శించారు. 

వై.ఎస్. ఆత్మ కేసీఆర్‌ను అవహించినట్టు కనిపిస్తోందని రేవంత్ సెటైర్ విసిరారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కోట్లు రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ దుష్ప్రచారం మానుకోవాలని హితవు చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేస్తాననడం నాటకమని ముఖ్యమంత్రి, జగన్ ల మధ్య ఎన్నో చీకటి ఒప్పందాలు ఉన్నాయని రేవంత్ అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: