రాజధాని అమరావతిని ఆకర్షించే విధంగా బెజవాడ నగరం నడిబొడ్డున మరో కలికితురాయి చేరనుంది. విజయవాడ స్క్వేర్ పేరిట ఏర్పాటయ్యే ఈ నిర్మాణం డిజైన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. నగర వాసులు సేదతీరేందుకు అనువుగా ఉండటంతో పాటు బహిరంగ సభలు, సమావేశాలు, సదస్సులు, వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహించేందుకు అనువుగా ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యలయం ఎదురుగా ఉన్న స్వరాజ్య మైదాన్ ను తీర్చిదిద్దనున్నారు.


ఏడాది లోపు దీనిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనతి కాలంలోని ప్రసిద్ధి గాంచిన దాదాపు 20ఎకరాల విస్తీర్ణంలోని ఈ మైదానాన్ని విజయవాడ స్క్వేర్ గా మార్చనున్నారు. దీని ప్రత్యేకతలను పరిశీలిస్తే..., మైదానం మధ్యలో అశోక స్తంభం తరహాలో దిగ్గజ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు.


దీనిపై విభాగంలో నాలుగు సింహాలు, మధ్యలో సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ నృత్యరీతులు, కింద భాగంల దేవతా మూర్తులతో ఆకర్షనీయంగా దీనిని నిర్మించనున్నారు. దీని చుట్టూ రంగు రంగుల విద్యుద్దీపాలతో వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు కానుంది. నగర చరిత్ర బెజవాడ విశిష్టత అందరికీ తెలిసేలా మైదానం వెనుక భాగంలో సిటీ గ్యాలరీని నిర్మించనున్నారు.


దాదాపు నాలుగు అంతస్తుల్లో ఇది ఏర్పాటు చేస్తారట. ఇందులో ప్రధానంగా నగరానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, ప్రధాన ఘట్టాలు, ముఖ్యమైన వ్యక్తులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేలా ఫోటోలు, డిటైల్స్ ప్రదర్శిస్తారు. చిన్నపాటి సదస్సులు కూడా ఇందులో నిర్వహించుకోవచ్చు. చుట్టూ పచ్చని చెట్లు, ఉద్యానవనాలతో ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ ప్రతిబింభించనుంది.

రాత్రి పూట రంగుల దీపాలతో ఈ ప్రాంతం మొత్తం కొత్త శోభ సంతరించుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: