ఓటుకు నోటు కేసు ఆ సీఎంను ఇంకా వెంటాడుతోంది. ఆయన్ను అధికారపీఠం నుంచి దించాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించకపోగా.. తిప్పికొట్టాయి కూడా. ఆయనే ఉత్తరాంఖండ్ సీఎం హరీశ్ రావత్. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఉత్తరాఖండ్ లో మళ్లీ సీఎం అయ్యారు. అయితే హరీశ్ పై కేంద్రం కోపం ఇంకా తగ్గినట్టు లేదు. ఇప్పుడు మరో కేసు హరీశ్ ను వెంటాడుతోంది. 

కాంగ్రెస్‌ తిరుగుబాటు శాసనసభ్యులకు డబ్బులు ఎరజూపి వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌కు సీబీఐ రెండోసారి సమన్లు జారీచేసింది. స్ట్రింగ్ ఆపరేషన్ లో లభించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం ఢిల్లీలోని తమ ఆఫీసుకురావాలని సీబీఐ ఆదేశించింది.

రావత్.. విచారణకు రావాల్సిందే..



ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో  9 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు సభ్యుల్లో కొందరిని తిరిగి తనవైపు తిప్పుకునేందుకు హరీశ్‌ రావత్‌ డబ్బు ఇవ్వజూపారాన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాలకు సంబంధించిందని చెబుతున్న ఓ సీడీ అప్పట్లో ప్రత్యక్షమైంది. దీనిపై అప్పట్లో సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఈ కేసు విచారణ నిమిత్తం ఈనెల 9న విచారణకు హాజరుకావాలని రావత్‌కు సమన్లు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో విచారణకు వెళ్లని రావత్‌.. సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు విఫలయత్నాలు చేశారు. ఫలితంగా మంగళవారం విచారణకు రావాలని హరీశ్‌ రావత్‌కు సీబీఐ మరోమారు సమన్లు జారీచేసింది. మొత్తానికి ఓటు కు నోటు కేసు రావత్ ను బలంగానే వేధిస్తున్నట్టుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: