జపాన్ కు అమరావతి రెండో ఇల్లు కావాలి. దీనిని సమష్టిగా నిర్మిద్దాం, మరో టోక్యో స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మీ సహకారం కావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు... జపాన్‌ పారిశ్రామికవేత్తలను కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన జపాన్‌ బృందంతో జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ బృందాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ... టెక్నాలజీ, ఆర్థిక వనరుల్లో జపాన్ ఉంటే, మానవ వనరుల విషయంలో భారత పటిష్టంగా ఉందన్నారు.


ఇక్కడి కార్మికులు క్రమశిక్షణతో పనిచేస్తారని చెప్పారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం పెద్ద వరమని పేర్కొన్నారు. రాజధానితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల శ్రీసిటీలో ఇసుజు మోటార్స్‌ ప్రారంభించామని, దాంతోపాటు మరో 15 కంపెనీలు కూడా వచ్చాయని చంద్రబాబు చెప్పారు.


భవిష్యత్తులో విజయవాడ నుంచి నేరుగా టోక్యోకు విమాన సర్వీసు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ విషయంలోనూ సహకరించాలని కోరారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర, సమగ్ర ఆర్థిక వృద్ధి సాధించేందుకు కూడా జపాన, ఏపీలు కలిసి ముందడుగు వేయాలని సీఎం పిలుపునిచ్చారు.  

 

ఈ ఏడాదిలో మరో 150 జపాన్ కంపెనీలు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. జపాన్ కష్టపడే తత్వం, క్రమశిక్షణ అంటే తనకు చాలా ఇష్టమని, భవిష్యత్తులో జపాన్-ఏపీల మధ్య మరింతగా సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

 

ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు(ఈడీబీ), ఇంధన, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖలు ఈ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. జపాన ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి యోసుకే తకాగి ఆధ్వర్యంలో 80 మంది పారిశ్రామికవేత్తలు ఇందులో ఉన్నారు. జపాన్ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన(జెట్రో) ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: