ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఎవరి మాట వింటారు...? అయన తీసుకునే కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించేది ఎవరికి...? మోడీ ఎవరిని పరిపూర్ణంగా నమ్ముతారు...? అంటే టక్కున వచ్చే సమాధనామే గుజరాత్ కేడర్ అధికారులు. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మాటను జవదాటని, తన అనుకునే అధికారులకే జాతీయ స్థాయిలో కీలక పదవులకు కట్టబెట్టారట. వారే ఇప్పుడు దేశ పరిపాలనా విభాగంలో కీలక పాత్ర నిర్వర్తిస్తున్నారట. . ఇతర రాష్ట్రా‌లకు చెందిన తనకు, తన వారికి సన్నిహితులుగా పేరున్న అధికారులను మోదీ పీఎంవోలో నియమించుకున్నారు...!

 

పాలనకు సంబంధించి అంశాలలో మోదీ మంత్రుల కంటే అధికారులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. తనను తప్పుదోవ పట్టించకుండా సరైన సమాచారం ఇచ్చేవారినే ఎంచుకున్నారు. వారినే ఏరికోరి మరీ కీలక శాఖల్లో కార్యదర్శులుగా నియమించారు. ఉదాహరణకు.. ఆర్థిక శాఖకు అనుబంధంగా నాలుగు శాఖలు ఉంటాయి. ఆ 5 శాఖల్లోనూ మోదీకి అత్యంత సన్నీహితంగా ఉండే గుజరాత కేడర్‌ అధికారి ఒకరైనా కీలక స్థానంలో ఉన్నారు. ‘‘ఆయన(మోదీ) మాపై నిఘా పెట్టారా? ఈ రోజుల్లో ఏం జరుగుతోందో ఏం తెలియట్లేదు’’ అంటూ ఈ నియామకాలకు వ్యతిరేకంగా ఉన్న ఓ అధికారి వాపోయారు. జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, హోం శాఖ వంటి కీలక శాఖల్లో మోదీ తన వారిని, తన నమ్మకస్థులుగా ఉండే అధికారులను కీలక స్థానాల్లో నియమించారు.

 

ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. అటువంటి పీఎంవోలో ప్రధాని తనకు అత్యంత విశ్వసనీయులైన అధికారులను నియమించుకున్నారు. వీరిలో అత్యధికులు గుజరాత కేడర్‌కు చెందిన అధికారులే కావడం గమనార్హం. ప్రధానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కె.మిశ్రా. ప్రస్తుతం ఆయన ప్రధాని అదనపు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈయన 1972 బ్యాచ్‌ గుజరాత కేడర్‌ అధికారి. మోదీ గుజరాత సీఎంగా ఉన్నప్పుడు 2004 నుంచి 2008 వరకు సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించి రిటైరయ్యారు. రిటైరయిన తర్వాత కూడా పి.కె మిశ్రాను మోదీ వదిలిపెట్టలేదు.


ఆయనకు గుజరాత ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇచ్చారు. ప్రధాని అయిన తర్వాత పీఎంవోకు తీసుకువచ్చారు. వివిధ శాఖలకు సంబంధించిన కీలక ఫైళ్లు, నియామకాలకు మిశ్రా ఆమోదముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యంత కీలక అంశాలతో పాటు దేశానికి సంబంధించిన రహస్య నిర్ణయాల్లో కూడా పి.కె.మిశ్రాకు స్థానముందంటే ఆయన మోదీకి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు.  యూపీఏ ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఉండేది. మోదీ ఆ వ్యవస్థని రద్దు చేసి అదే స్థానంలో గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ ఏర్పాటు చేశారు. ఈ చర్యతో మంత్రుల కంటే కార్యదర్శులనే మోదీ ఎక్కువ విశ్వసిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: