చంద్రబాబు కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్ కు నివాసం మార్చిన విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇలా ఓ ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని ఫైవ్ స్టార్ హోటల్లో నివాసానికి ఉంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓ ముఖ్యమంత్రిగా ఆ స్టార్ హోటల్ బిల్లు ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసం కోసం ఇప్పటివరకూ పెట్టిన ఖర్చులు వివరిస్తూ సాక్షి పత్రిక సంచలన కథనం ప్రచురించింది. 

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న బాధ్యతలు చేపట్టిన తరువాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడోది. సొంత ఇంటి నుంచి స్టార్ హోటల్‌కు మారే వరకు చంద్రబాబు ఉన్న నివాసాలు, కార్యాలయాల మరమ్మతుల నిమిత్తం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు  సాక్షి పత్రిక తన కథనంలో రాసింది. వీటి మరమ్మత్తులు, భద్రతా ఏర్పాట్లకే ఈ మొత్తంలో సింహభాగం ఖర్చు చేశారని తెలిపింది. 

బాబూ..ఏల ఈ దుబారా..?




ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఉండే హోటల్ అద్దె అందులో ఉన్న సౌకర్యాలు, విస్తీర్ణం బట్టి రోజుకు రూ. 17 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుందట. అదే నెలకు అయితే వాటి విస్తీర్ణాన్ని బట్టి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకూ హోటల్ వసూలు చేస్తుంది. వీటికి పన్నులు అదనం. సీఎం కుటుంబం ఎక్కడ నివాసం ఉన్నా వారికి అయ్యే ఖర్చు, అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఈ డబ్బంతా ప్రజల సొమ్మేనని సాక్షి తెలిపింది. 

సాక్షి కథనం ప్రకారం.. సీఎం అయిన మొదట్లో జూబ్లీహిల్స్ లోని ఇంటికి మరమ్మత్తులు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మదీనాగూడలోని ఫామ్ హౌజ్ రిపేర్ల కోసం 2 కోట్లు, విజయవాడ క్యాంపు కార్యాలయం కోసం 42 కోట్లు, సచివాలయం మరమ్మత్తుల కోసం 20 కోట్లు, ఫర్నిచర్ కోసం 10 కోట్లు, ప్రత్యేక బస్సు కోసం 6 కోట్లు, తాడేపల్లిలోని నివాసం కోసం 10కోట్లు..ఇలా మొత్తం సుమారు 100కోట్ల వరకూ చంద్రబాబు ఇళ్లు, నివాసాల కోసం ఖర్చయిందని సాక్షి రాసుకొచ్చింది. ఇవన్నీ తాజా ఫైవ్ స్టార్ హోటల్ బిల్లు కాకుండానండోయ్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: