టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రెండు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్.. పలువురు నేతలతో మంతనాలు నిర్వహించిన తర్వాత పార్టీ నుంచి  కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీఎస్ పేర్లను టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ పేరును ఖరారుచేసింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదలైన విషయం తెలిసిందే. 31వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం. జూన్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. జూన్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. 


వాస్తవానికి టీఆర్ఎస్‌లో రాజ్యసభ సీటు కోసం పోటీ గట్టిగానే కనిపించింది. సీఎల్ రాజం, కేసీఆర్ సన్నిహితుడు దామోదరరావు తదితరుల పేర్లు కూడా వినిపించినా, అన్ని లెక్కలను దృష్టిలో పెట్టుకుని పై రెండు పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో కేబినెట్ హోదాలోనే ఉన్నా, కేంద్రంలో ఆయనకున్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్ర దృష్ట్యా ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు.

ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్‌ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. కాగా, రాష్ట్రం తరపున ఎంపీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హన్మంత్‌రావు, తెలుగుదేశం పార్టీ ఎంపీ గుండు సుధారాణి పదవికాలం వచ్చే జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. కాగా తెలంగాణలో తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల కాంగ్రెస్, టీడీపీలు ఈసారి తమ అభ్యర్థులను రాజ్యసభకి పంపే అవకాశం లేదు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు పూర్తి సంఖ్యాబలం కలిగిన టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను పంపే అవకాశం దక్కించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: