తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. తిరుపతి వేదికగా మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక సహా ప్రాంగణాలు, ప్రత్యేక గ్యాలరీలు సిద్ధమయ్యాయి. రెండు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆత్మీయ ఆతిథ్యం పలికేందుకు తిరుపతి వేదిక ముస్తాబైంది.  పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్‌ జన్మదినం సమయంలో ఈ సమావేశాలు నిర్వహించడం ఆ పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. 


సుమారు 20 వేల మంది ప్రతినిధులు మహానాడుకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో మొదలయ్యే ఈ సమావేశాలు ఆదివారం సాయంత్రం ఆయన ముగింపు ఉపన్యాసంతో ముగియనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి తిరుపతిలో నిర్వహిస్తున్నారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత తిరుపతి మరోసారి మహానాడుకు ఆతిథ్యం ఇస్తోంది.

 

రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని తెదేపా మహానాడు వేదికగా నిర్ణయించనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం ఇది రెండో మహానాడు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి కూడా దాదాపుగా అంతే కాలమైంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల అంశాలపైనా దృష్టిపెట్టనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా.

 

ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష....వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపైనా కొంత చర్చ జరగనుంది. భవిష్యత్తు మరింత ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలన్న అంశంపై ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. తెలంగాణకు సంబంధించి పార్టీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేలా తీర్మానాలు ఉండనున్నాయి. ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి.

 

టీఆర్‌ఎస్‌పై గురి 
తెలంగాణలో టీఆర్‌ఎ్‌సపై రాజకీయ దాడికి కూడా ఆ పార్టీ మహానాడు వేదికను వినియోగించుకోనుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, కరువు, రైతుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం వంటి వాటిని వివిధ తీర్మానాల ద్వారా సమావేశాల్లో ప్రస్తావించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: