తాత్కాలిక సచివాలయానికి సరిపడే భవనాల వేట మొదలైంది. ప్రస్తుత యాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందిని సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేయాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారులు ఏడాది పాటు తమ నివాసాల నుంచే విధులు నిర్వహించే అవకాశమిద్దామని ముఖ్యమంత్రి వారితోనే అభిప్రాయపడ్డట్లు సమాచారం.


రెండ్రోజుల కిందట సీఎస్ రాజీవ్‌శర్మ సారధ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ వీటిపై ప్రత్యేక సమాలోచనలు జరిపింది. ముఖ్య కార్యదర్శులు అధర్‌సిన్హా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాణ వ్యవధిలో ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, సచివాలయ కేంద్రంగా ఉండే మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ కార్యకలాపాలు ఎక్కణ్నుంచి నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. తాత్కాలిక విడిదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి..? ఎక్కడెక్కడ అందుకు అనువైన భవనాలున్నాయని ఆరా తీశారు.


వీటిని స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ఉన్నతాధికారులతో అభిప్రాయపడ్డట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న హెచ్‌వోడీ భవనాలు, కార్యాలయాల్లో అంతకు మించి సదుపాయాలున్నవి ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది.. సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న శాఖల అధికారులు, సిబ్బందిని ఎక్కడెక్కడికి తరలిస్తారనేది ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: