వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయ సాయిరెడ్డి పేరు ఖరారు అయింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సుదీర్ఘ భేటీ అనంతరం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. విజయ సాయిరెడ్డి ఎంపిక పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మాట్లాడుతూ, ఆయన ఎంపికకు గల కారణాలను వివరించారు.


తనపై కొందరు కుట్రలు పన్ని, కుమ్మక్కై రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించినప్పుడు దర్యాప్తు సందర్భంగా సాయిరెడ్డి నైతిక విలువలకే కట్టుబడ్డారని చెప్పారు. ఈ వ్యవహారంలో మొత్తం నెపాన్ని జగన్‌పై నెట్టేస్తే సాయిరెడ్డిని కేసుల్లో సాక్షిగానే ఉంచి ముద్దాయిగా చేయబోమని దర్యాప్తు సందర్భంగా విపరీతంగా ఒత్తిడి చేశారని, అయినా ఆయన లొంగకుండా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు.

 

చంద్రబాబువీ కుట్ర పూరిత రాజకీయాలు...

ఎవరైతే పార్టీ కోసం శ్రమించారో, మానవ సంబంధాలకు విలువనిచ్చారో వారిని నాయకుడనే వాడు అర్థం చేసుకోవాలని, ఆ ఆలోచనతోనే ఈ ఎంపిక జరిగిందని వివరించారు. అందరి సమక్షంలో విజయసాయిరెడ్డికి మంచి మనసుతో ‘బీ ఫాం’ ఇచ్చి పంపాలని భావించామన్నారు. మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని మండిపడ్డారు.

 

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, నట్టేట ముంచుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కేవలం ఒకే ఒక్క మాట కోసం వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: