తెలుగు రాష్ట్రాల్లో సచివాలయాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆంధ్రాకు కొత్త సచివాలయం రూపుదిద్దుకుంటుంటే.. ఉన్న సచివాలయం బాగాలేదని తెలంగాణ కొత్త సచివాలయం కట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతం వెలగపూడిలో కొత్త సచివాలయం యుద్ధ ప్రాతిపదికన పురుడు పోసుకుంటోంది. 

ఇప్పటికే కొన్ని భవనాలు స్లాబులు పూర్తి చేసుకున్నాయి. మంచి ముహూర్తాలు తర్వాత లేవని చంద్రబాబు సచివాలయాన్ని ప్రారంభం కూడా చేశారు. ఇటు చూస్తే తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి.. యుద్ధ ప్రాతిపదికన ఏడాది వ్యవధిలోనే కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

తెలంగాణ సచివాలయం కూల్చేస్తారట..



ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంత వరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా సీఎస్ రాజీవ్‌శర్మ సారధ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ వీటిపై ప్రత్యేక సమాలోచనలు జరిపింది. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందిని సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేయాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది.

సీఎం కోసం సచివాలయం సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్‌లోని ఎక్స్‌పోటెల్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం భవనాల పేర్లు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలనకు స్వీకరించింది. వీటిని స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ఉన్నతాధికారులతో అభిప్రాయపడ్డట్లు తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: