అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లిన తన వదిన మాటూరి లావణ్య (29) పట్ల, తనపట్ల ఆలయం వద్దే కొంతమంది యువకులు అసభ్యంగాా ప్రవర్తించినట్టు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాధితురాలు దివ్య స్పష్టంగా చెప్పింది. అక్కడ నుంచి తప్పించుకొని వస్తున్న తమను ఆ పోకిరీలు కారుతో వెంబడించి మరీ సాలాపువానిపాలెం వద్ద గుద్ది కొంతదూరం ఈడ్చుకెళ్లిపోయారని వివరించింది. ఈ ఘటనలో తన వదిన లావణ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు ఆమె తెలిపింది.

 

లంకెలపాలెం సమీపంలోని సాలాపువానిపాలెం వద్ద ఇటీవల జరిగిన హత్య ఘటన జిల్లావాసులను నివ్వెరపరిచింది. అయితే నిందితులపై చర్యలకు పోలీసులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిర్భయ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఒత్తిళ్లకు లొంగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి దాదాపు వారం కావస్తున్నా దర్యాప్తు ముందుకు కదలకపోవడం, నిందితుల ఆచూకీపై కనీస సమాచారాన్ని సేకరించకపోవడం చర్చనీయాంశమైంది.

 

 నిందితుని కోసం తాము గాలిస్తున్నా ఆచూకీ తెలియడంలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. కాగా ప్రధాన నిందితుడు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదని బాధితుల బంధువులు అంటున్నారు. ఈ హత్యను వారు ఇంకా ట్రాఫిక్ కోణంలోనే చూడటం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హేమకుమార్ ఒక మాజీ మంత్రి అనుచరుడని చెబుతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే సాకుతో వారు ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు  చేస్తున్నట్లు పోలీసువర్గాలు సైతం చెబుతున్నాయి.


ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ముగ్గురు నింది తుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం. ఫైనాన్షియరైన ప్రధాన నిందితుడు హేమకుమార్ ప్రవర్తనపై అనకాపల్లిలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని కఠినంగా శిక్షించాలని, ఈ కేసును తీవ్రంగా పరిగణించాలంటూ అనకాపల్లి ప్రాంతానికి చెందిన పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హేమకుమార్ వాడిన కారుకు బీమా లేదని, అతడికి లెసైన్స్ కూడా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని రక్షించేం దుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు చెబుతున్నారు.


కాగా హత్య చేసినట్టు బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తేనే తాము దర్యాప్తు చేసే వీలుంటుందని ట్రాఫిక్ సీఐ కృష్ణ చెప్పగా.. ట్రాఫిక్ పోలీసుల నుంచి తమకు కేసు బదిలీ అయితే తప్ప ప్రమాదంపై తాము దర్యాప్తు చేపట్టలేమని పరవాడ శాంతిభద్రతల విభాగం పోలీసులు బాధితుల ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు వెళ్లకుండా కొంతమంది పెద్దలు బాధితులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: