ఏపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదలైంది. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు జిల్లాల పురోగతి వివరాలు ప్రకటించారు. రంగాలవారీగా చూస్తే.. తలసరి ఆదాయంలో 1,40,648 రూపాయలతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో వుంది.  74,638 రూపాయల తలసరి ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా ఆఖరిస్థానంలో నిలిచింది. 1,40,593లతో కృష్ణాజిల్లా రెండవస్థానంలోను, 1,21,724లతో పశ్చిమగోదావరి జిల్లా మూడవస్థానంలో నిలిచాయి. 

వ్యవసాయంలో పశ్చిమగోదావరి జిల్లా మొదటి స్థానంలో వుండగా, కృష్ణా జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానంలో వున్నాయి. శ్రీకాకుళం జిల్లా చివరిస్థానానికే పరిమితమైంది. అటు పశుగణాభివృద్ధిలో కృష్ణా, తూర్పగోదావరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో వున్నాయి. కడప చివరి స్థానంలో వుంది. అటవీ ఉత్పత్తుల రంగంలో చిత్తూరు మొదటి స్థానం, విజయనగరం చివరిస్థానంలో వున్నాయి. 

విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్.. 


మత్స్యపరిశ్రమాభివృద్ధిలోనూ పశ్చిమ గోదావరి జిల్లా ముందుంది. కడప చిట్ట చివరన నిలిచింది. అలాగే పరిశ్రమలరంగంలో విశాఖజిల్లా ప్రథమ స్థానంలో వుండగా, తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానం, కృష్ణా జిల్లా మూడో స్థానంలో వున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలరంగం రాష్ట్రంలోనే అట్టడుగున వుంది. సేవారంగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, విశాఖ జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి మూడో స్థానం, శ్రీకాకుళం జిల్లా 13వ స్థానంలో వున్నాయి. 

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మండలాల వారీగా జీవీఏలను ప్రభుత్వం నమోదు చేసింది. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి సంబంధించి జీవీఏలో కృష్ణా జిల్లా కలిదిండి మండలం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో వుంది. పరిశ్రమలరంగంలో విశాఖ జిల్లాలోని గాజువాక మండలం, సేవల రంగంలో విజయవాడ అర్బన్ మండలం తొలి స్థానంలో నిలిచాయి. కాకినాడ అర్బన్, విశాఖ జిల్లా పెదబయలు, చిత్తూరు జిల్లా నిండ్ర మండలాలు జీవీఏలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో వరుసగా అట్టడుగున నిలిచాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: