తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం అప్పట్లో ఓ సంచలనం. ఎన్నో ఆశ్చర్యాలు.. అనుమానాలు.. ఇది సాధ్యమవుతుందా.. అసలు జరగుతుందా.. ఈ డాటా అంతా ఏంచేస్తారు.. ఆంధ్రా వాళ్లను గుర్తించేందుకు ఇంత భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారా..ఇలా ఎంతో చర్చ జరిగింది. మొత్తానికి సాఫీగా సాగింది. 

ఇప్పుడు ఆ సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ కు కొత్త రికార్డు తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు జాతీయ రికార్డుగా గుర్తించింది. ఒకే రోజు రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల  కుటుంబాల వివరాలను సేకరించింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వేను నిర్వహించారు. 

భారీ సర్వే.. రికార్డులకెక్కింది...


దీన్ని  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ రికార్డుగా గుర్తించింది. ఈ సంస్థ ఎడిటర్ విజయ ఘోష్  ఈ మేరకు  ధృవీకరణ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఒ కే రోజు కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు,  వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తి పాస్తుల వివరాలన్నీ సేకరించారని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు పేర్కొంది. 

ఈ సమగ్ర కుటుంబ సర్వే పై వచ్చిన విమర్శలను తెలంగాణ సర్కారు తిప్పికొట్టింది. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదని భారీ ఎత్తున ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాలు రూపొందించేందుకు.. ఆ ఫలాలు అందరికీ అందాలనే ఈ సర్వే నిర్వహించినట్టు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి గతులను తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడింద కేసీఆర్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: