కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధి, విధివిధానాలపై సిద్ధం చేసిన ముసాయిదా వివరణ పత్రం (మాన్యువల్‌)పై 10 రోజుల్లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. ఒక వేళ చెప్పకుంటే వాటిని ఆమోదించినట్లుగా పరిగణించి ముసాయిదానే ఖరారు చేస్తామని ‘బోర్డు’ ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఛైర్మన్‌ నాథన్‌ అధ్యక్షతన జరిగిన కృష్ణా నది బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 


బోర్డుకు కొత్త చైర్మన్ వచ్చాకే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి ముసాయిదా సిద్ధం చేసుకోవాలని సమావేశంలో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. కృష్ణా జలాల లభ్యత, వినియోగం, నీటి ప్రోటోకాల్, ప్రాజెక్టుల నిర్వహణ వంటి 11 అంశాలపై చర్చించేందుకు బోర్డు ఇక్కడి కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ నాథన్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో అంశాల వారీగా ఎవరి వాదనలు వారు వినిపించారు.


భారీ ఎజెండాతో చేపట్టిన ఈ సమావేశం ఏ ఒక్క అంశంపైనా పూర్తిస్థాయిలో స్పష్టత రాకుండానే ముగిసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ప్రస్తావన వచ్చినపుడు తెలంగాణ అధికారులు ధీటుగానే సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులే తప్ప అవి కొత్తవి కావని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదకొండో షెడ్యూల్‌లో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్నారు. దీంతో శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు.. మరి అది పదకొండో షెడ్యూల్‌లో ఎందుకు లేదు? అసలు పదకొండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టుల జాబితాను మేం వ్యతిరేకిస్తున్నాం.. అని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు స్పష్టం చేసినట్లు తెలిసింది. 


కాగా 2016-17 నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీ ఎలా ఉండాలనేదానిపై చర్చ నిర్వహించారు. గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన మేరకు బచావత్ దామాషా (తెలంగాణ-299 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్-512 టీఎంసీ) మేరకు పంపిణీ చేసుకుందామా అని బోర్డు రెండు రాష్ర్టాలను అడిగింది. దీనిపై రెండువారాల్లో తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం జరిగేవరకు గత ఏడాది జరిగిన ఒప్పందం మేరకే పంపిణీ విధానం అమలులో ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. 

కాగా గత ఏడాది నీటి లెక్కల్లో గందరగోళం నెలకొన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. నీటి వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాల్ని పంపడంతోపాటు ప్రత్యేకంగా బాధ్యతాయుతమైన అధికారుల్ని ఇందుకోసం నియమించాలనే నిర్ణయం జరిగినట్లు సమాచారం. సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావు, ఐఎస్‌డబ్ల్యూఆర్ అధికారులు కోటేశ్వర్‌రావు, వెంకటనారాయణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ వెంకటేశ్వర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: