నరేంద్రమోదీ.. అలుపెరుగని వికాస యాత్రికుడు. అధికారం చేపట్టగానే ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేసే భారీ ప్రణాళికను భుజానకెత్తుకుని నలుమూలలా చుట్టివచ్చిన దౌత్యనేత. ఈ రెండేళ్ల సమయంలో ప్రధాని మోదీ 40 విదేశీ పర్యటనలు చేశారు. ఐదు ఖండాలను చుట్టబెడుతూ.. మొత్తమ్మీద 1,74,000 మైళ్ల గగన దూరాలకు ప్రయాణాలు చేశారు. ఈ పర్యటనలపై కొందరు పరాచికాలాడారు, మరికొందరు ఈసడించుకున్నారు. అయినా ప్రధాని మోదీ మాత్రం మొక్కవోని సంకల్పంతో ఒక చేత్తో మువ్వన్నెల జెండానూ, మరోచేత్తో దేదీప్యమానమైన భారత అభివృద్ధి అజెండానూ పట్టుకుని అలుపెరుగని ప్రపంచ యాత్రికుడిలా చుట్టుపక్కల దేశాల నుంచి సుదూర ద్వీపాల వరకూ చుట్టివచ్చారు.

 

ఇరుగుపొరుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రధానిగా మోదీ తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు. పక్క దేశాలతో సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యమివ్వడం, హిందూమహాసముద్ర ప్రాంతంలో భారత ప్రయోజనాల పరిరక్షణకు కృషి జరపడం, అమెరికాతో మునుపెన్నడూ లేని స్థాయిలో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం, జపాన్‌తో భాగస్వామ్యం, చైనా, రష్యాలతో సంబంధాల్ని సమతౌల్య స్థాయిలో కొనసాగించడం, పశ్చిమ ఐరోపా, మధ్యాసియా, ఆగ్నేయాసియా, పర్షియన్‌ గల్ఫ్ ప్రాంతాల్లో ముఖ్యమైన భాగస్వాములను పెంపొందించుకోవడం, పాక్‌ ప్రధానికి చేరువవ్వడం, కెనడా నుంచి ఫిజీ వరకు ప్రవాస భారతీయుల్లో ఉత్తేజాన్ని నింపడం.. నరేంద్రమోదీ అలుపెరగని కృషికి మచ్చుతునకలు.

 

ప్రపంచీకరణ యుగంలో విదేశీ పరిణామాలు భారత వ్యూహాత్మక, అభివృద్ధి లక్ష్యాలపై ప్రభావం చూపుతాయన్న సంగతిని గుర్తెరిగి వ్యవహరించారు. అఫ్గాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ వంటి కీలక పొరుగు దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడం.. ఎన్నో ఏళ్లుగా విస్మరించిన మంగోలియా వంటి దేశాల్ని పలకరించడం.. భారత ఆర్థిక విజయంలో కీలకమైన జర్మనీ వంటి దేశంతో సంబంధాలు నెరపడం.. భారత వ్యూహాత్మక ప్రయోజనాల్లో ముఖ్యపాత్ర పోషించే ఆస్ట్రేలియా, జపాన్‌, సింగపూర్‌లకు మరింత దగ్గరవడం, అమెరికాతో సంబంధాల్లో సమూల పరివర్తన చేపట్టడం.. ఇవన్నీ సాధించేందుకు మోదీ వైయక్తిక దార్శనికతతోపాటు, రాజకీయ, దౌత్య విజ్ఞతను పెట్టుబడిగా పెట్టారు. పలు దేశాల నేతలతో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తు ప్రయోజనాలకు బాటలు పరిచారు. యాక్ట్‌ఈస్ట్‌ పాలసీ పేరిట చేపట్టిన విధానం పలుదేశాలు ఇటువైపు చూసేలా చేసింది. గత యూపీఏ ప్రభుత్వం పట్టించుకోని ఎన్నో దేశాలకు దగ్గరవ్వడం, ఏళ్లకొద్దీ భారత ప్రధానులు తొంగిచూడని దేశాలకుసైతం వెళ్లడం ద్వారా మోదీ పరిపక్వ పరిణతిని ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: