ఆంధ్ర‌ప్ర‌దేశ్ తాత్కాలిక  రాజ‌ధాని విజ‌య‌వాడ ప్ర‌కాశం బారేజి దాటి ఉండ‌వ‌ల్లి మీదుగా శాశ్వ‌త రాజ‌ధాని గా ప్రక‌టించిన గ్రామాల‌లో నుంచి పాత అమ‌రావ‌తికి వెళ్తూ ఉంటే గ‌త రెండు సంవ‌త్సరాలుగా జ‌రుగుతున్న మార్పులు గ‌మ‌నిస్తే అర్ధ‌మ‌వుతుంది, ఆప్రాంతంలో సామాజిక, ప‌ర్యావ‌ర‌ణ‌, వ్య‌వ‌సాయ ఏ స్థాయి లో  విధ్వంసం జ‌రిగిందో.  రెండేళ్ల క్రితం వ‌రకు ప‌చ్చ‌ని పంట పొలాలతో సంవ‌త్స‌రం పొడుగునా మ‌రో కోన సీమ అనింపించేలా ఉండే ప్రాంత‌మంతా ఇప్పుడు వేగంగా రాబోతున్న మార్పుల‌కు ఎలా సిద్దం కావాలో తెలియని ప‌రిస్థితులు ఉన్నాయి. రోడు పొడువునా పొలాల‌కు బ‌దులు రియ‌ల్  ఎస్టేట్ భూముల హోర్డింగ్ లు, ఆయా గ్రామాల్లో విప‌రీతంగా పెరిగిన ఇళ్ళ నిర్మాణాలు, గ‌తంలో ఎన్న‌డు క‌నిపించని విధంగా అత్యాధ‌నిక‌మైన కార్లు, పేయింగ్ గెస్ట్ సౌక‌ర్యం ఉందంటూ  ఫోన్ నెంబ‌ర్ల‌తో గోడ‌లు మీద క‌నిపించే పోస్ట‌ర్లు, కొత్త వ్య‌క్తులు ప‌రాయి భాష‌లు, బుల్ డోజ‌ర్లు, భూస‌మీక‌ర‌ణ పేరుతో నిర్భంధం ఎలా ఉందో ఉండ‌వ‌ల్లి గ్రామస్థులును అడిగితే తెలుపుతారు. ఈ ఊరు చుట్టూ 50 మీట‌ర్ల వెడ‌ల్పు ఉండే రేడియ‌ల్ రోడ్లు దాదాపు ప‌దికి పైగా నిర్మించాల‌ని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది.
 
ఉండ‌వ‌ల్లి ప‌రిస‌ర ప్రాంతం వ్య‌వ‌సాయానికి ప్ర‌సిద్ది...
 
అయితే ఉండ‌వ‌ల్లి ప‌రిసర ప్రాంతాల్లో భూములు చాలా విలువైనవి.  మూడు పంట‌లు పండే ప్రాంతం. వీటి మీద ఆధార‌ప‌డి బతుకుతున్న ల‌క్ష‌లాది మంది జీవితాల‌ను ప్ర‌శ్నార్ధ‌కం మార‌నున్నాయి. ఈ ప్రాంతంలో 125 ర‌కాల పంట‌లు పండుతాయి. క‌రువ‌నేది లేదు. ప‌నిదోర‌క‌దనే ప్ర‌శ్నే లేదు. మా ఊరి వాళ్ళే  కాదు... విజ‌య‌వాడ అవ‌త‌లి నుంచి కూడా ఇక్క‌డ‌కు కూలి ప‌నుల‌కు వ‌స్తారు. కౌలు రైతులుగా వ‌చ్చి స్వంత దారులైన రైతులు ఉన్నారు.  ఆడ‌వాళ్ళ‌కి ఇక్క‌డ రోజుకి రూ. 250- 350 వ‌రకు కూలి దొరుకుతుంది. హైద‌రాబాద్ బెంగుళూర్, ముంబాయి లాంటి ప్రాంతాల‌కు కూర‌గాయ‌లు, పూలు రోజూ స‌రఫ‌రా చేస్తారు. మా పొలాల‌ను ముంచేసి సింగ‌పూర్, జపాన్ వాళ్ళ‌కు వాళ్ళ పారిశ్రామిక అవ‌స‌రాల‌కు భూమిని క‌ట్ట‌బెట్ట‌డ‌మేంటీ?  మేము అడిగితే మమ్ముల్ని అభివృద్ది వ్య‌తిరేకుల‌మ‌ని ముద్ర‌వేస్తున్నారు. మేము రాజ‌ధానికి వ్య‌తిరేకం కాదు గానీ, దానికి ఇంత భూమి అవ‌స‌ర‌మా? వ‌్య‌వ‌సాయ భూముల‌ను నాశనం చేయ‌డ‌మేంట‌ని అడుగుతున్నాం, 2013 చట్టం ప్ర‌కారం మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అభిప్రాయం అడ‌గాలి. కానీ ఇక్క‌డ అలా జ‌ర‌గ‌డం లేదు. ఇస్తారా ఇవ్వ‌రా అని బెదిరించ‌డం త‌ప్పి మ‌రేదీ  జ‌ర‌గ‌టం లేదు. ఇచ్చినా వారంద‌రూ స్వ‌చ్చందంగా ఏమీ ఇవ్వ‌లేదు. భ‌య‌ప‌డి ఇచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.

భూములు స్వాదీనం కోసం ప్ర‌భుత్వం హ‌ల్ చ‌ల్...

ఇక ఇవ్వ‌ని వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, మీరు ఇవ్వ‌క‌పోతే మేము స్వాధీన‌ప‌రుచుకుంటామ‌ని బ‌హిరంగంగానే చెబుతున్నారు. మీకు క‌నీసం న‌ష్ట‌ప‌రిహారం కూడా రాద‌ని  వార్నింగ్ ఇవ్వ‌డం ష‌రామాములుగానే ఉన్నాయి. ప్ర‌భుత్వం ఇక్క‌డి ప్రాంతం వాసుల‌ను ప్ర‌భుత్వం ఎంత భ‌య‌పెడుతోందంటే అది కంటికి క‌నిపంచేది కాదు.  ఆ ప్రాంతం ఊర్లో రాత్రి ప‌గ‌లు అనకుండా పొలం ప‌నులు జ‌రుగుతూనే ఉంటాయి. రాత్రి పూట కూడా భ‌య‌ప‌డ‌కుండా పూలు కోయ‌డానికి ఆడ‌వాళ్ళు వెళ్తారు. అంత నిర్బ‌యంగా విలువ‌ల‌తో ఉండే ప్రాంతం.  అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అడుగుకో పోలీసు. అర్ధ‌రాత్రి మీకేం పని అని వాళ్ళు కూలీల‌ను ఆప‌టం. ఊర్లోనే జైల్లో లాగా బ‌త‌కాల్సి వ‌స్తోంది. రాజ‌ధాని ప్రాంత  రాక‌పోక‌ల కోసం రోడ్డు వెడ‌ల్పు  చేసే కార్యక్ర‌మంలో ఊర్లో ఒక కుటుంబం చిన్నాభిన్న‌మైంది. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాజ‌ధాని నిర్మాణంలో ఈ మాత్రం కూడా త్యాగం చేయ‌క‌పోతే ఎలా అని ఇత‌ర స‌భ్య స‌మాజం అనుకోవ‌చ్చు. వ్య‌వ‌సాయ కూలీగా ఉన్న ఓ అభాగ్యురాలి ఇంటిని అర్ధ‌రాత్రి వ‌చ్చి బుల్ డోజ‌ర్ ల‌తో కూల్చేశారు. ఏ ర‌క‌మైన నోటీసు లేకుండానే ఇళ్ళును కూల్చేశారు. అప్ప‌టికే ప‌క్ష వాతం తో మంచాన ఉన్న  ఆమె భ‌ర్త ఈ చ‌ర్య‌తో మాన‌సికంగా తీవ్ర ఆవేద‌న చెంది చ‌నిపోయారు. పిల్ల‌ల‌ను పెట్టుకుని ఎక్క‌డ ఉండాలో తెలియ‌ని పరిస్థితిలో ఉంది ఆ కుటుంబ మ‌హిళ.

అనుమ‌తులు లేని సీఎం అధికార నివాసం....

వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డే రైతుల పొలాల‌పై రోడ్లు వేసేసి బిల్డింగులు క‌ట్టేస్తే వారి ఏమై పోవాలి? ప‌చ్చ‌టి పొలాల‌ను నాశనం చేయ‌డ‌మేంటీ? ఈ భూముల పై బ‌తుకుతున్న రైతుల క‌నీసం అడిగే వారేలేరు. ప్ర‌స్తుతం ఈ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోనే కృష్ణా న‌ది ఒడ్డున అనుమ‌తులు లేకుండా ఒక పెద్ద కాంట్రాక్ట‌ర్ క‌ట్టిన భ‌వంతిలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి అధికార నివాసం ఏర్పాటు చేసుకున్నారు. న‌దికి అవ‌త‌లి ఒడ్డున పేద ప్ర‌జ‌లు క‌ట్టుకున్న చిన్న ఇళ్ళ‌ను అనుమ‌తులు లేవ‌నే పేరుతో వారికి నిర్బంధంగా అక్క‌డి నుంచి త‌రలించే కార్య‌క్ర‌మం పోలీసు బ‌లగాల నేతృత్వంలో నిర్విఘ్నంగా  జ‌రుగుతోంది. ఇక్క‌డ కూడా అనుమ‌తులు లేని ముఖ్య‌మంత్రి గారి అధికార నివాసం చుట్టూ రాత్రీ ప‌గ‌లు అనకుండా పోలీసు బ‌ల‌గాలు ప‌హారా కాస్తునూ ఉంటున్నాయి. స్థానిక రైతుల‌ను, కూలీల‌ను, ఇత‌ర ప్ర‌జ‌ల‌ను నిత్యం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అమ‌రావ‌తి ప‌ట్ట‌ణ కేంద్రం ప‌రిస‌ర ప్రాంతాల్లో గత రెండేళ్ళ నుంచి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో వేగంగా మార్పు తీసుకుంటున్న సామాజిక  అంశాలు ఇంతా అంతాకాదు. జీవ‌న వ్య‌యం నాలుగింత‌లు పెరిగింది. ఇంటి అద్దెలు, కూర‌గాయ‌లు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి.అంత‌కు ముందు చాలా ర‌కాల కూర‌గాయ‌లు లభించేవి. రాజ‌ధాని ప్ర‌కటించి అనేక గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నుల‌ను ఆపేయ‌టంతో కూర‌గాయ‌ల ల‌భ్య‌త త‌గ్గింది.

నూతన రాజ‌ధాని అమ‌రావ‌తిలో త్రాగునీరు క‌రువు....

వ్య‌వ‌సాయ ప‌నులు లేవు. వ్య‌వ‌సాయ కూలీల జీవ నాధారం పూర్తిగా పోయింది. కొత్త ప‌నుల కోస‌సం ఎంతో దూరం వెళ్ళాల్సి వ‌స్తోంది. కుటుంబ జీవ‌నం కోసం అనివార్యంగా ఆడ‌వాళ్ళు వ్య‌భిచార కూపంలోకి వెళ్ల‌డం పెరుగుతోంది. పాత అమ‌రావ‌తి ప‌ట్ట‌ణం నుంచి తుళ్ళూరు వైపుగా నాలుగు కిలో మీట‌ర్ల వెళితే ఎడ‌మ చేతివైపు కొన్ని గుడిసెలు ఉన్నాయి. అక్క‌డి ప‌రిస్థితులు చూస్తుంటే ఇది మ‌నుషులుండ‌గ‌లిగితే ప్రాంత‌మైనా అని అనుమానం రాక‌మాన‌దు. మే నెల రోహిణి కార్తె, న‌ట్ట‌న‌డివేస‌విలో  గుక్కెడు నీళ్ళ కోసం ఆ కాల‌నీ అంతా ఎదురు చూస్తోంది. రోజుకి ఒక ట్యాంక‌ర్ మ‌ధ్యాహ్నం మూడు నాలుగు  గంట‌ల మ‌ధ్య వ‌స్తోంది. పిల్లా, పాప‌, ముస‌లీ ముత‌కా అంద‌రి ధ్యాసా, ఎదురు చూపులు ఆ నీళ్ళ మీదే. ప‌క్క‌నే ఉన్న కిష్ణాన‌ది నుంచి నీళ్ళు ప‌ట్టి ట్యాంక‌ర్ ద్వారా  పంపిస్తారు. అలా ఎంత‌కాలం పంపిస్తారో తెలియదు. ఎనిమిదేండ్ల క్రితం అంత‌ర్జాతీయ బౌద్ద ఉత్స‌వం కాల‌చ‌క్ర సంద‌ర్భంగా ప‌ట్ట‌ణ సుంద‌రీక‌ర‌ణ‌లో భాగంగా రోడ్ల ప‌క్క‌న నివాస‌ముంటున్న యానాదుల్ని ఊడ్చి ఊర‌వ‌త‌ల పారేశారు. వీరి ఉనికి అంత‌ర్జాతీయ స‌మాజం ముందు అవ‌మానంగా ఉంటుంది కాబ‌ట్టి వారి అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఒక్క‌రోజు లో రాత్రి కి రాత్రి వారిని ఈ ప్రాంతానికి త‌రలించేశారు.


సింగ‌పూర్ న‌గ‌రాన్ని మించిన అమ‌రావ‌తి లో పర్య‌వార‌ణ విధ్వంసం...


జీవ‌న ప‌రిస్థితులు మ‌రింత దిగజారాయి త‌ప్పించి  అంత‌కు మించి వారి బతుకుల్లో వ‌చ్చిన అభివృద్ది అంటూ ఏమీ లేదు. ధ్యానం లో ఉన్న బుద్దుడి విగ్ర‌హం కోసం క‌ట్టిన రేకుల షెడ్డు త‌ప్ప మ‌రో  మ‌హా క‌ట్ట‌డ‌మేమీ అక్క‌డ లేదు. కూలిపోయే గుడిసెలు త‌ప్ప‌. క‌రెంటు మాటేలేదు.  ఈ మధ్య నే ఎవ‌రో దాత‌లు సోలార్ వీధిలైట్టు పెట్టించార‌ట. అదే వారి జీవితాల్లో వ‌చ్చిన మ‌హా వెలుగనుకోవాలి.  ఈ ఆధునిక రాజ‌ధాని నిర్మాణంలో క‌నీస పాటి ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కోల్పోతున్న ఇలాంటి అనేకానేక స‌మూహాల లెక్క ఏనాటికైనా బ‌య‌ట‌కు వ‌చ్చునో లేదో. జరుగుతున్న పర్యావరణ, వ్యవసాయ విధ్వంసానికి సమాధానం ఎప్పుడు దొరుకునో.  సింగ‌పూర్ ని మించిన అంత‌ర్జాతీయ న‌గ‌రాన్ని నిర్మిస్తామంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రాతి ముంగిట్లో ఇదీ ప‌రిస్థితి. 


మరింత సమాచారం తెలుసుకోండి: