తెలుగు చిత్రపరిశ్రమలో నటసార్వభౌముడిగా వెలిగిపోయిన నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పే విధంగా తెలుగు దేశం పార్టీ స్థాపించి పల్లె ప్రజలకు కూడా రాజకీయాలంటే ఏమిటో తెలియజేసేలా చెప్పారు. అలాంటి మహానుభావుడి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఇప్పుడు మహానాడులో   ఎన్టీఆర్‌ గురించి చెప్పడమే విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇతర సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదని ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకరించారని, రాజ్యాంగ విరుద్ధమైన కిరికిరి కమిటీలు వేసి ప్రజలను బాధ పెడుతున్నారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ది సాధించే పథకాలు చేపట్టామంటున్న చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమను పట్టుకున్నారని విమర్శించారు. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగొలు డబ్బు సంపాదన సంపాదిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ కొనుగోలు చేయాలనే ఆలోచన దుర్మార్గమని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. నదులను అనుసంధానం చేశానంటున్న చంద్రబాబును చూసి ఇరిగేషన్ నిపుణులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు రక్కసి కాటేస్తుందని . రైతులు మళ్లీ వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి కల్పించనది చంద్రబాబేనని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: