తెలంగాణ రాష్ట్రం మూడో అవతరణ దినోత్సవం జరుపుకోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే కాదు.. తెలంగాణ బయట కూడా ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు తెలంగాణవాదులు. 

తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు బ్రిటన్ పార్లమెంట్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక బ్రిటన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్ర, రూప హక్ తో పాటు భారత హైకమిషన్ ప్రతినిధి అశీష్ శర్మ పాల్గొన్నారు. బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రవాస తెలంగాణ వాసులు ఉత్సవాలకు హాజరయ్యారు. 

బ్రిటన్ లో తెలంగాణ సంబురాలు.. 



అమరవీరులతో పాటు ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించి ఈ వేడుకలను ప్రారంభించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందని ప్రశంసించిన బ్రిటన్ ఎంపీలు.. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. 

తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి  చెప్పడమే కాకుండా, ప్రపంచ వేదికల్లో పరిచయం చేయడానికి తెలంగాణా ఎన్నారై ఫోరం  చేస్తున్న కృషి గొప్పదని...  ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ ప్రవాస భారతీయులంతా కలిసి సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. లండన్ వీధుల్లో జై తెలంగాణ అంటూ పోరాటాలు చేసి ఇపుడు ఏకంగా బ్రిటన్ పార్లమెంట్ లోనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెరాస ఎన్నారై విభాగం అధ్యక్షులు అనిల్ కూర్మాచలం అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: