చంద్రబాబు సర్కారులోని కొందరు పెద్దలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని సాక్షి పత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. చెన్నై సమీపంలోని మహాబలి పురం రోడ్డు లో గుంటూరు జిల్లా అమరావతి దేవస్థానానికి 88 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని అతి తక్కువ ధరకు టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారు. 

ఈ వ్యవహారం జరిగిన తీరుపై సాక్షి వివరణాత్మకంగా సుదీర్ఘ కథనం ప్రచురించింది. చెన్నైలోని విలువైన ప్రాంతంలో ఉన్న ఈ భూములను కారు చౌకగా అయిన వాళ్లకు కట్టబెట్టారని తన కథనంలో తెలిపింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే ఈ భూములను కేవలం ఇరవై రెండు కోట్లకే కట్టబెట్టారని లెక్కలతో సహా ఆ పత్రిక దనాన్ని ఇచ్చింది.


చెన్నైలోని ఆ భూముల విలువ అధికారికంగానే ఎకరం ఆరు కోట్లు ఉంటే ఆంధ్రా సర్కారు ఎకరా ఇరవై ఏడు లక్షలకే ఎలా అమ్మేందుకు అనుమతి ఇచ్చిందని సాక్షి నిలదీసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తో ఈ భూములు అమ్మాలంటూ లేఖ రాయించి.. దాన్ని సి.ఎమ్.ఆఫీస్ తో ఓకే చేయించి.. ఇష్టారాజ్యంగా భూములు అమ్మేశారని.. దాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ , టీడీపీ నేత చలమలశెట్టి రామనుజయ్య కుటుంబ సభ్యులు కొన్నారని సాక్షి ఆధారాలు చూపింది. 

ఈ మొత్తం వ్యవహారం వెనుక సీఎం కుమారుడు లోకేశ్ ఉన్నారనే అర్థం వచ్చేలా నేరుగా పేరు పెట్టకుండా సాక్షి తన కథనంలో పేర్కొంది. సర్కారు భూములను కాపాడుకోలేమని.. దాన్ని అమ్ముకోమని ఓ ఎమ్మెల్యే లేఖ రాయడం ఏంటో.. దాని ఆధారంగా సర్కారు చౌక ధరకు అమ్మేయడం ఏంటో.. మొత్తం అడ్డగోలుగా సాగిన ఈ వ్యవహారం చంద్రబాబు సర్కారుకు పెద్ద మచ్చే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: