తెలంగాణ అంశం చివరి ఎపిసోడ్ కు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్ర ఆక్టోపస్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లైన్ లోకి వచ్చారు. ఎప్పుడు సర్వే ఫలితాలను వెలువడిస్తూ సక్సెస్ అయ్యే లగడపాటి మరోసారి తెలంగాణ అంశంపై స్పందించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందన్న అనుమానం తనకు ఒక్క శాతం కూడా లేదని రాజగోపాల్ చెప్పారు. ఏకాభిప్రాయ సాధన కోసమే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, విభజన కోసం కాదని స్పష్టం చేశారు.


అఖిలపక్ష భేటీలో పార్టీలు భిన్న వాదనలు వినిపించాయన్నారు. తెలుగుతల్లిని ఎవరూ ముక్కలు చేయలేరని ఆయన అన్నారు.
అసెంబ్లీలో మళ్లీ తెలంగాణపై తీర్మానం పెట్టాలని కోరుతామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన అసాధ్యమన్నారు. చంద్రబాబుపై చిటపటలు.. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై చిర్రుబుర్రులాడారు లగడపాటి. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టీడీపీ వెనక్కి తీసుకోలేదని, అందుకే ప్రస్తుత సమస్య తలెత్తిందని చెప్పారు.


టీడీపీ నాయకులు మాట్లాడకపోవడంవల్లే ఇప్పుడు అయోమయం నెలకొందన్నారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాల గురించి చంద్రబాబుకు కనువిప్పు కలిగించేందుకు జగ్గయ్యపేటలో కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం బాబు మనసు మార్చుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే తమ బలం చూపిస్తామని లగడపాటి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: