కాపులను మరోసారి రోడ్డు ఎక్కించే అవసరం లేకుండానే ఇచ్చిన హామీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తిచేశారు. ఆయన శనివారం పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణలను కలిసి ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాపులకు ఎన్నో సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపుల ఓట్లకు వలవేసి ఎన్నికల్లో గెలిచారని, ఆ హామీలను అమలుపరచకపోవడం వల్లనే తునిలో తాను ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. రాజస్థాన్, హర్యానాల్లో తమకంటే ముందుగా ఉద్యమాలు చేపట్టిన వారికి తీపి కబురు అందిందని, ఆ తీపి కబురు సీఎం అందించాలని  విజ్ఞప్తి చేశారు.


మాది నిజాయతీ ఉద్యమం:దాసరి
కాపులను బిసిల్లో చేర్చాలని నిజాయతీగా ఉద్యమం చేస్తున్నామని సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. తాము ఎవరి చేతి వద్ద ఉన్న అన్నం అడగడం లేదని, మిగిలిన దానిలో ఇవ్వమని కోరుతున్నామని చెప్పారు. 


ఉద్యమానికి మద్దతు : చిరంజీవి
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి తాను మద్దతుగా ఉంటానని సినీనటుడు, ఎంపి చిరంజీవి ప్రకటించారు. ముద్రగడకు తాము అండగా ఉంటామని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 


కుట్ర పన్నుతున్న బాబు : రఘువీరారెడ్డి
కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. పైగా కాపులు, బిసిల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. వైసిపి నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చే అంశంపై జరిగే ఉద్యమానికి సహకరిస్తామని తెలిపారు. 


వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న ముద్రగడ
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాపు ఉద్యమానికి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. తుని ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ముద్రగడ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్య గర్జన, నిరవధిక దీక్షలకు మద్దతు పలికిన నాయకులను ముద్రగడ స్వయంగా కలుస్తున్నారు. మరో ఉద్యమానికి మద్దతు పలకాలని కోరుతున్నారు. మాజీ ఎంపి హర్షకుమార్‌ను, కాంగ్రెస్‌ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌లను కలిసి మద్దతు కోరారు. హైదరాబాద్‌లో శనివారం ప్రముఖులను కలిశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: