అధికార పార్టీలో ఉంటే చాలా పనులవుతాయి. అధికారులను బెదిరించి ఎలాంటి పనయినా చేయించుకోవచ్చు. సర్కారీ స్థలాలను అధికారికంగానే కబ్జా చేసుకోవచ్చు. అధికారాన్ని అడ్డుపెట్టుని ఎలాంటి సెటిల్ మెంటైనా ఇట్టే కానీయొచ్చు.. బహుశా ఇలాంటి వెసులుబాట్ల కోసమే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రతిపక్షాన్ని వదిలి అధికార పార్టీలో చేరారేమో అనిపిస్తోంది.

ఎందుకంటే కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు చూస్తే ఈ అనుమానం కలుగక మానదు. నంద్యాలలోని పశుసంవర్థక శాఖ స్థలాన్ని వేలం వేయాలంటూ ఎం.ఎల్.ఏ. భూమా నాగిరెడ్డి రాసిన లేఖ ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న పశువైద్యశాల స్థలం నిరుపయోగంగా ఉందని.. దీన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలంటూ మార్చి 23 న ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూమా లేఖ రాశారు. 

రూ.10 కోట్ల భూమిపై భూమా నాగిరెడ్డి కన్ను..



ఇలా వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని కలెక్టర్ ఖాతాలో జమ చేసి నంద్యాల అభివృద్ధికి వెచ్చించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ స్థలం వివరాలను ఇవ్వాలంటూ ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా పశుసంవర్థక శాఖకు పంపించింది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా 2.5 ఎకరాలు ఉందని ఇందులో ఏడీ డివిజనల్ కార్యాలయం, రైతు శిక్షణా కేంద్రం, ఆసుపత్రి, మందులు, వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు, ఉద్యోగుల నివాసాలు, డివిజినల్ రికార్డుల గదులు ఉన్నాయంటూ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 

ఒకవేళ నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ భూమి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  దీన్ని అమ్మకుండా ఉంటేనే మంచిదని  పేర్కొన్నారు. ఈ భూమికి మంచి గిరాకీ ఉంది. మార్కెట్లో సుమారు 10 కోట్ల రూపాయలు వరకూ ఉంటుంది. దీన్ని కారు చౌకగా కొట్టేసేందుకే భూమా ఆ లేఖ రాశారని.. ఎప్పుడో గుట్టు చప్పుడు కాకుండా బహిరంగ వేలం వేస్తారని అధికారులు భావిస్తున్నారు. నంద్యాలలో భూమా వేలానికి వస్తే అంతకు మించి పాటపాడే దమ్ము ఎవరికి ఉంటుంది కనుక ఆ భూమి భూమాపరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: