ఫేస్ బుక్ ప్రేమ ఒక అమ్మాయి నిండు జీవితాన్ని బలి చేసింది. ప్రేమించిన యువకుడు ఆమెను వంచించి వధించాడు. వివరాల్లోకి వెళితే, చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మల్లేశ్ యాదవ్ కూతురు జానకి (26) వృత్తిరీత్యా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఏడాది క్రితం నల్గొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన యశ్వంత్‌గౌడ్ (27)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.


ఆ పరిచయం ఇద్దరూ ఏకాంతంగా కలుసుకొనేంత వరకూ వెళ్లింది. యశ్వంత్‌గౌడ్ ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం నాగోల్‌లో ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జానకిని ప్రేమిస్తున్నాని నమ్మించి, ఆమె వద్ద డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ జానకి ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకుందామని ఒత్తిడి పెంచడంతో ఆ దుర్మార్గుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. గదిలో దారుణంగా హత్యచేసి, ఆమె ఒంటిపైనున్న బంగారు నగలు తీసుకొని, మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి, అర్ధరాత్రివేళ గౌరెల్లి సమీపంలో మూసీనదిలో పడేశాడు. ఈ విషయం తెలియని జానకి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మొదటిసారి తనకేమీ తెలియదన్న యశ్వంత్ రెండోసారి అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాడు. చాదర్‌ఘాట్ పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

జానకి కాల్ డేటా, ఆమె ఫేస్‌బుక్ అకౌంట్, మెయిల్స్, వాటిలో వీరిద్దరి సంభాషణ ఆధారంగా నిందితుడు యశ్వంతేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం నాడు మూసీ నది నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికు తరలించామని, యశ్వంత్‌ను అరెస్ట్ చేశామని సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. జానకి హత్య విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: