తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది వలసలు వెళ్లడం జరిగింది. గత సంవత్సరం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామ రూపం లేకుండా ఓడిపోయాయి. దీంతో అధికార పార్టీపై మరింత నమ్మకం ప్రజల్లో కలిగింది. ఇక తాము ఇతర పార్టీలో ఉంటే మనుగడ సాద్యమనుకున్న నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం తెలుగు దేశం పార్టీ నుంచి ముఖ్యనాయకులు మొత్తం టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. తాజాగా తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది.

మల్లారెడ్డి సంస్థల అధినేత, మల్కాజ్గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్ గూటికి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై కార్యకర్తలతో మల్లారెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.అయితే గతంలోనే మల్లారెడ్డి టీడీపీలోకి వస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి కానీ ఆ వార్తలన్నిఆయన ఖండించారు. తెలంగాణలో టీడీపీకి మిగిలిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి కూడా పార్టీకి గుడ్బై చెప్పడంతో గ్రేటర్లో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది.

అంతే కాదు ఆ మద్య  వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో వైసీపీ పార్టీ మొత్తమే గల్లంతయ్యింది. ఇప్పుడు టీడీపీ పార్టీ లో ఉన్న ఒక్కరిద్దరూ కూడా వెళ్లిపోతే తెలంగాణలో టీడీపీ పార్టీ కూడా పూర్తిగా గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు ఆలోచనలో పడ్డారు. మొత్తం మీద తన వ్యాపార ప్రయోజనాల కోసమే మల్లారెడ్డి జంప్ జిలానీ అవుతున్నారని అంటున్నారు. ఎంపీ మల్లారెడ్డి గులాబీ పార్టీలో చేరితే కేడర్ కూడా అటు జంప్ అవుతారు. దీంతో గ్రేటర్ టీడీపీ సగం ఖాళీ కావడం ఖాయంగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: