ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళా ఉద్యోగి సాహసయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 27 నాటికి అమరావతికి తరలిపోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఓ మహిళా ఉద్యోగిలో స్ఫూర్తి నింపింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీటీవోగా పనిచేస్తున్న పద్మ... ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సైకిల్‌పై పయనమయ్యారు. ఉద్యోగుల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఉద్యోగులు శాఖాల వారీగా బయల్దేరుతు న్నారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారిణి మాత్రం సాహసం చేశారు. వినూత్నంగా విజయవాడకు సైకిల్ పై బయల్దేరారు.


శుక్రవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ లోని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి సైకిల్ పై బయల్దేరారు. ఆమెకు మద్దతు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేతలు అశోక్ బాబు, కృష్ణయ్య జెండా ఉపి ప్రారంభించారు. తోటి ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకు సైకిల్ వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పద్మ తెలిపారు.  కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొత్త ఆర్గపాడుకు చెందిన మందడి రామారావు, పుష్పావతిల కూతురు మందడి పద్మ తొమ్మిదో తరగతి వరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే కొనసాగింది. ఆ తర్వాత ఖమ్మం వచ్చిన పద్మ టీటీసీ వరకు అక్కడే చదివింది. 2000 సంవత్సరంలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2012 వరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. అంబేద్కర్ దూర విద్యా కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన పద్మ.. 2012లో గ్రూప్స్ రాసి వాణిజ్య పన్నుల శాఖలో సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారిణిగా ఉద్యోగం సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: