బ్రెగ్జిట్ పై బ్రిట‌న్ దేశ ప్ర‌జ‌ల సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇప్పుడు ప్ర‌పంచ దేశాల ఆర్ధిక మాద్యం దెబ్బ‌తినే అవ‌కాశాలు లేక‌పోలేదు. అయితే ఒక్క‌టి మాత్రం నిజం అభివృద్ది పై సెంటిమెంట్ పై చేయి అని నిరూపించారు బ్రిటన్ ప్ర‌జ‌లు. యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిటన్ మ‌హా నిష్క్రమ‌ణ కు  ఓటింగ్ జరిగిపోయింది. జాతి ఔన్న‌త్యాన్ని నిలుపుకోవాలని, త‌మ దేశ ప్ర‌తిష్ట‌, ప్ర‌త్యేక‌త కాపాడుకోవాల‌న్న జాతీయవాదుల ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఒక‌నాడు ప్ర‌పంచాన్నే త‌మ వ‌ల‌స‌గా మార్చుకున్న‌వారు ఇప్పుడు న‌లుగురిలో ఒక‌రిగా  ఉండ‌డానికి ఇష్ట ప‌డ‌ట్లేదు. నాడు ప్ర‌పంచ‌దేశాలపై ఆధిప‌త్యం చెలాయించిన వారికి నేడు సొంత దేశంలో కూడా స్వ‌త్రంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌రిస్థితి మింగుడుప‌డ‌లేదు.  28 దేశాల యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి నిష్క్ర‌మించాలా  అనే అంశాన్ని తేల్చ‌డానికి బ్రెగ్జిట్ పేరుతో నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ ఎగ్జిట్ కే ఓటు వేసింది. బ్రిట‌న్ లో ఉన్న ఇంగ్లాండ్, వేల్స్ ప్ర‌జ‌లు, ఇయూ  నుంచి విడిపోవాల‌ని భావించ‌గా... నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్ మాత్రం క‌లిసుండాల‌ని కోరుకున్నాయి.


1973 లోనే ఈయూ లో బ్రిట‌న్ స‌భ్య‌త్వం తీసుకుంది...

యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిట‌న్ విడిపోవ‌డం వ‌ల్ల ఎన్నో న‌ష్టాలు ఉంటాయని ఆ దేశ ప్ర‌ధాని  డేవిడ్ కామెరాన్ చెప్పినా విన‌కుండా విడిపోవ‌డానికే మెజారిటీ ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. దాంతో 43 సంవ‌త్సరాల బంధం ఒక్క‌సారిగా తెగిపోయింది. గ్రెట్ బ్రిట‌న్ అంటే ఇంగ్లండ్, వేల్స్, స్కాట్ లాండ్, నార్త్ ఐర్లాండ్ స‌మూహంలోని మొత్తం 382 కేంద్రాల్లో బ్రెగ్జిట్ జ‌రిగింది. కూటమిలో కొన‌సాగాలా వ‌ద్దా  అనే అంశం పై నిర్వ‌హించిన ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ లో విడిపోవ‌డానికి 51.8 శాతం మంది,  క‌లిసి ఉండాల‌ని 48.2 శాతం మంది ఓటేశారు. 1957 లో ప్ర‌స్తుత ఈయూ కు ప్ర‌తి రూప‌మైన యూరోపియ‌న్  ఎక‌నామిక్ క‌మ్యూనిటీ(ఈఈసీ) ఏర్ప‌డిన‌ప్పుడు కూడా ఇందులో స‌భ్య‌త్వం కోసం బ్రిట‌న్ ఆస‌క్తి చూప‌లేదు. చాలా కాలం త‌రువాత అంటే 1973 లోనే అందులో బ్రిట‌న్ స‌భ్య‌త్వం తీసుకుంది. కూట‌మిలో చేరిన నాటి నుంచి ఆ దేశంలో అక్క‌డ‌క్క‌డ వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతూనే వ‌చ్చింది. కూట‌మిలో చేరిన రెండేళ్ల‌కే ఈఈసీ లో ఉండాలా? వ‌ద్దా? అని బ్రిట‌న్  రిఫరెండం జ‌రుపుకున్న‌ది. అయితే ఆ ఏడాది మొత్తం 67 శాతం మంది అనుకూలంగా ఓటేయ‌డంతో ఆ వివాదానికి తెర‌ప‌డింది. అయితే కొంద‌రి వాద‌న సజీవంగానే ఉంది. 

బ్రిట‌న్ దేశం పై బ‌రాక్ ఒబామా హెచ్చ‌రిక‌లు...

అయితే రెఫ‌రెండం ఫ‌లితాలు వెలువడుతుండ‌గానే బ్రెగ్జిట్  అనుకూల‌త‌ను చూపిన‌వారు వీధుల్లో డాన్సుల‌తో పండ‌గ  చేసుకున్నారు. ఇండిపెండెన్స్ పార్టీ నాయకుడు ఫ‌రాజ్ మాట్ల‌డుతూ ఈ రోజే దేశానికి స్వాతంత్య్ర‌మ‌ని ప్ర‌క‌టించారు. బ్రెగ్జిట్ పై రెఫ‌రెండం జ‌రిగిన రోజున ప్ర‌తిఏటా దేశ వ్యాప్తంగా బ్యాంకుల‌కు సెల‌వుదినంగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఇక ప్ర‌ధాని కామెరాన్ తన ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ లో కొత్త ప్ర‌ధానిని ఎన్నుకుంటారు. ఈయూ నుంచి విడిపోతే బ్రిట‌న్ ఆర్ధికంగా, రాజ‌కీయంగా బ‌ల‌హీన‌ప‌డి అంత‌ర్జాతీయంగా దాని ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా హెచ్చ‌రించాడు. ప‌లువురు వ్యాపార వేత్తులు, కార్పొరేట్ దిగ్గ‌జాలు సైతం బ్రెగ్జిట్ ను వ్య‌తిరేకించాల‌ని కోరారు. అయితే వీరి హెచ్చ‌రిక‌ల్ని, సూచ‌న‌ల్ని జ‌నం ప‌ట్టించుకోలేదు. అయితే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప్ల‌బిక‌న్ పార్టీ అభ్య‌ర్థి గా ఖ‌రారు కానున్న డోనాల్డ్ ట్రంప్ మాత్రం రెఫ‌రెండం ఫ‌లితాల‌ను స్వాగ‌తించాడు. తీర్పు అద్భుత‌మ‌న్నాడు. బ్రిట‌న్ వాసులు త‌మ దేశాన్ని సాధించుకున్నార‌ని కొనియాడారు.
.
బ్రిగ్జెట్ ప్ర‌భావంతో సెన్సెక్స్ కుదేలు...

ఒబామా ఉహించన‌ట్టుగానే బ్రెగ్జిట్ ఫ‌లితాల ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ల‌కు ఇది బ్లాక్ ఫ్రైడే గా మారింది. ఓ ద‌శ‌లో వెయ్యి పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయిన సెన్సెక్స్ కొద్దిగా  కోలుకొని 604 పాయింట్ల‌ను న‌ష్ట పోయింది. డాల‌ర్ తో పోల్చుకుంటే పౌండ్ మార‌కం విలువ 31 ఏళ్ళ క‌నిష్ట స్థాయికి ప‌డిపోయింది. ఇక భార‌త్ లో రూపాయి విలువ ప‌డిపోయింది. బంగారం ధ‌ర ఒక్క‌రోజే 1800 రూపాయ‌లు పెరిగింది. భ‌విష్య‌త్ లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగి నిత్య‌వస‌ర స‌రుకుల ధ‌ర‌లు ఆకాశాన్నంటే ప్ర‌మాదం ఉంది. అయితే ఐరోపా లోని మిగ‌తా దేశాలో పోలిస్తే బ్రిట‌న్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ర‌వి అస్త‌మించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిట‌న్ ఇప్పుడు గుంపులో గోవిదంయ్యలా, కూట‌మిలో ఒక‌దేశంగా ఉండ‌టం పై బ్రిట‌న్ లో కొంత మంది కినుక‌గా ఉన్నారు. కూట‌మితో సంబంధం లేకుండా బ్రిట‌న్ స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవాల‌న్న‌ది వారి వాద‌న‌. 

ఈయూ నుంచి త‌ప్పుకుంటే బ్రిట‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ కు పెను సవాల్....

కూట‌మి నుంచి త‌ప్పుకుంటే వ‌ల‌స‌లు త‌గ్గి, త‌మ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌తో పాటు త‌మ దేశ ప్ర‌త్యేక సాంస్కృతిక విలువ‌లూ నిల‌బ‌డ‌తాయ‌ని బ్రెగ్జిట్ కోరుకునే వారు చెబుతున్నారు. ఇక ఈయూ నుంచి త‌ప్పుకుంటే ఆర్ధిక వినాశ‌నం త‌ప్ప‌ద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. బ్రిట‌న్ విదేశీ వాణిజ్యంలో స‌గం ఈయూ దేశాల‌తోనే జ‌రుగుతోంది. బ్రిట‌న్ కు అందే విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈయూ దేశాల నుంచే వ‌స్తోంది. లండ‌న్  అంత‌ర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎద‌గ‌డానికీ ఈయూ స‌భ్య‌త్వం ఎంతో దోహ‌దం చేసింది. గుడ్డిగా ఈయూ నుంచి త‌ప్పుకుంటే ఆర్థిక వ్య‌వ‌స్థ కు పెను స‌వాల్ త‌ప్ప‌ద‌ని బ్రెగ్జిట్ వ్య‌తిరేకులు  హెచ్చ‌రించారు. అయితే చివ‌రికి స్థానిక సెంటిమెంట్ ప‌నిచేసింది. దీనికి తోడు కూట‌మి దేశాల్లో త‌ర‌చూ త‌లెత్తుతున్న ఆర్థిక సంక్షోభాల‌తో ఈయూ ప‌రువు గంగ‌లో క‌లుస్తోంది. ఇష్ట‌మున్నా లేక‌పోయినా సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల ఆర్థిక భారాన్ని స‌భ్య దేశాలూ మోయాల్సి వ‌స్తోంది. బ్రిట‌న్ పౌరుల‌కు ఇది ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు.

బ్రిట‌న్ ఆర్థికంగా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్నాయి...

ఇవ‌న్నీ ఈయూ నుంచి బ్రిట‌న్  త‌ప్పుకోవాల‌నే వాద‌న‌కు ఊతం ఇచ్చాయి. వంద‌ల సంవ‌త్సరాల పాటు ప్ర‌పంచంలోని ఎన్నో దేశాల‌ను త‌న గుప్పిట్టో ఉంచుకుని పాలించిన బ్రిట‌న్ ఇప్పుడు స్వాతంత్య్రం కోరుకుంటున్న‌ది. చివరికి బంధాల నుంచి విముక్తి పొందింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని అమలు చేయాడానికి సుమారు రెండేళ్ల కాలం పడుతుంది. మొత్తం మీద బ్రిట‌న్ దేశ ప్ర‌జ‌లు త‌మ అస్థిత్వాన్ని చాటుకున్నార‌న‌టంలో సందేహం లేదు. అయితే ఇప్ప‌టికిపుడు బ్రిట‌న్ పై మాత్రం ఆర్థికంగా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి బ్రిట‌న్ దీనిని అదిగ‌మించేందుకు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: