యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం అక్కడ ఉంటున్న భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. దాంతోపాటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కొంతవరకు ముప్పు తప్పదని అంటున్నారు. యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్లోకి వలసలు ఎక్కువయ్యాయన్న ఆందోళనే ‘బ్రెగ్జిట్’ నిర్ణయానికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే కారణంతో అక్కడున్న భారతీయులకు సైతం ముప్పు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.



 దీనికంతటికి కారణం యూరోపియన్ యూనియన్ లో భారత ఐటీ సేవలకు మంచి మార్కెట్ ఉండటమే. ప్రస్తుతం 7.25 లక్షల కోట్లున్న దేశీయ ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ రంగంలో 6.70 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. ఇందులో 30 శాతం ఐరోపా దేశాలకే ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక్క బ్రిటన్ కే భారత్ నుంచి 17 శాతం ఐటీ ఎగుమతులుంటాయని నిపుణులు చెబుతున్నారు.



ప్రస్తుత పరిస్థితో ఎగుమతులు చాలావరకు నిలిచిపోయే అవకాశముందంటున్నారు ఐటీ ఎక్స్ పర్ట్స్. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశముంది. ఈ లోపు బ్రిటన్ నుంచి పెద్ద కాంట్రాక్టులేవీ వచ్చే పరిస్థితి లేదు. అలాగే కొత్తగా నిధులు కేటాయించే అవకాశం ఉండదు కాబట్టి కొత్త ప్రాజెక్ట్ లు మంజూరు కావడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఇక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనే దానిపై ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉందని, పరిస్థితి ఇంతకుముందులా లేదని లీడ్స్ ప్రాంతంలో ఉండే గణేశన్ చెప్పారు. యూకేకు వలస రావాలన్న ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని తెలిపారు. యూరప్, బ్రిటన్లలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఐటీ కంపెనీల మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: