తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ సేకరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. భూసేకరణ విషయంలో రైతుల ఇష్టానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కలిశారు. 



మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పునరావాసంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు వారి అభిప్రాయాలకు అనుగూణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని వివరించారు. 2013లో తెచ్చిన చట్టం ఒకటి కాగా... తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.123 మరొకటి. రైతులు ఏ పద్దతి ప్రకారం పరిహారం కావాలంటే ఆ లెక్క ప్రకారమే పరిహారం అందిస్తామని వెల్లడించారు. 



జీవో నెంబర్ 123 ప్రకారం కావాలన్న వారికి అదే విధానం ద్వారా, 2013 చట్ట ప్రకారం కావాలన్న వారికి అదే నిబంధన ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షాల రాద్ధాంతం కారణంగా ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. తాజా నిర్ణయంతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం తీసుకునే రైతుల భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: