ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని, సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మార్చుకోవాలని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. క‌ట్టుబ‌ట్ట‌లతో హైద‌రాబాద్‌కు వ‌చ్చామ‌ని అమ‌రావ‌తిని అభివృద్ధి చేసుకుందామ‌ని అన్నారు. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన ప్రాంతాన్ని రాజ‌ధానిగా నిర్ణ‌యించామ‌ని, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎక‌రాల భూములిచ్చారని ఆయ‌న అన్నారు.



 రాజధాని నిర్మాణానికి 'స్విస్ ఛాలెంజ్‌' పద్ధతికి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామ‌ని చంద్రబాబు ప్రకటించిన విషయం మనకు విదితమే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రివ‌ర్గం రాజ‌ధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిని ఆమోదించ‌డంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానం మంచిది కాదని కేల్కర్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయ‌న అన్నారు.



 స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తి వద్ద‌ని కేంద్రం అన్ని రాష్ట్రాల‌కు సూచించినా చంద్ర‌బాబు ఆ విధానాన్నే ఎందుకు అమ‌లు చేస్తున్నార‌ని బొత్స ప్ర‌శ్నించారు. దేశంలో ఉన్న కంపెనీలు భ‌వ‌నాల నిర్మాణాల‌కు ప‌నికిరావా..? అని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. డబ్బు మూటలిచ్చేవారే నీతిమంతులా..? అని ఆయ‌న వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: