ఢిల్లీలో మీడియా సమావేశం జరుగుతుండగానే ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియాను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ని ప్రకటించారంటూ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఎన్నికైన వారిని అరెస్టులు చేయడం, భయపెట్టడం, వారిపై దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ కేజ్రీవాల్ విమర్శించారు. 'ఢిల్లీని అర్ధ రాష్ట్రమని అంటారు. ఆ అర్ధరాజ్యానికి నేను పావు ముఖ్యమంత్రినని చెప్తారు. మరీ రాత్రంతా వాళ్లకు మేము కలలోకి వచ్చినట్టు మమ్మల్ని చూసి అంత భయపడతారెందుకో' అంటూ బీజేపీ మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 



నీటి సంక్షోభంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కొందరు మహిళలపై మోహనియా అనుచితంగా ప్రవర్తించాన్న అభియోగంపై ఢిల్లీ పోలీసు బృందం ఆయనను దక్షిణ ఢిల్లీలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉండగా నిర్బంధంలోకి తీసుకుంది. మోహనియా ఢిల్లీ జల్ బోర్డు వైస్‌ చైర్మన్‌గా కూడా ఉన్నారు. నీటి సమస్యపై నిలదీసిన కొందరు మహిళలపై దురుసుగా ప్రవర్తించడం, బెదరించడం, మహిళల గౌరవాన్ని కించపరచడం చేశారంటూ ఈనెల 23న మోహనియాపై కేసు నమోదైంది. శుక్రవారంనాడు తుగ్లకాబాద్ ఏరియాలో 60 ఏళ్ల మహిళను చెంపదెబ్బకొట్టారనే ఆరోపణపై గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో మోహనియాపై మరో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది.



కాగా, దినేశ్ మోహనియా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నీటి కొరతపై వినతిపత్రం ఇచ్చేందుకని నిన్న ఆయన కార్యాలయానికి ఒక వృద్ధుడితో పాటు పలువురు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే, వారితో ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించడమే కాకుండా వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని ఆరోపణలు, ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: