ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం త‌మ తమ జిల్లాలు, నియోజ‌క వ‌ర్గాలు, మండ‌లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ  సీఎం కేసీఆర్ చ‌క చ‌క జిల్లాల విభ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టారు. అయితే దీని పై ఏపీ చంద్ర‌బాబు మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌రికొన్ని రోజుల్లో అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావించినా... దీనికి ఎన్నిక‌ల సంఘం అసెంబ్లీ సీట్లు  పెంచేది లేద‌ని, 2011 జ‌నాభా లెక్కల ప్ర‌కారం అసెంబ్లీ సీట్లు 2026 వ‌రకు పెరిగే ప్ర‌సక్తి లేదని తేల్చి చెప్పింది. అయితే చంద్ర‌బాబు మాత్రం పూర్తి స్థాయి న‌మ్మ‌కంతో ఇత‌ర పార్టీ నేత‌ల‌ను లాగేసుకుంటున్నారు. ఎలాగు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాలు పెరుగుతాయి క‌దా. అన్న భావ‌న‌లో బాబు ఉన్నారు. అయితే 2019  ఎన్నిక‌ల వ‌ర‌కు నియోజ‌క వ‌ర్గాల పెంపు దాదాపుగా ఆసాధ్య‌మేన‌న్న వాద‌న ఉంది. ఇప్ప‌టికే అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల పెంపుపై కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించినా కొన్ని ఇబ్బందులు త‌లెత్తాయి. 

కేంద్రం చొరవ తీసుకుంటే త‌ప్ప, క‌ష్ట‌మే...

తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌క వ‌ర్గాల పెంపు ఎలా ముందుకెళ్లాలో తెల‌పాలంటూ కేంద్ర న్యాయ‌శాఖ‌కు నోడ‌ల్ ఏజెన్సీ అయిన హోంశాఖ  ఒక ఫైల్ పంపింది. దీని పై ఆటార్ని జ‌న‌ర‌ల్ అభిప్రాయాన్ని తెలుసుకుని బిల్లు త‌యారు చేసి హోంశాఖ కు పంపుతారు. ఆ త‌రువాత కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదానికి పంపి, పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెడతారు. ఈ త‌తంగమంతా పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. అంటే కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో చొర‌వ తీసుకుంటే త‌ప్ప‌, 2019 లో నియోజ‌క వ‌ర్గాల విభ‌జ‌న క‌ష్ట‌మే.  కానీ 2014 విభ‌జ‌న చ‌ట్టం, సెక్ష‌న్ 26  ప్ర‌కారం  తెలంగాణ‌లో 119 ఉండ‌గా 153 గా, ఏపీలో 175 ఉండ‌గా 225 గా పెంచే అవ‌కాశాలు ఉన్నాయి. దీని పై కేంద్ర ప్ర‌భుత్వం డీలిమిటేషన్ ఆర్టిక‌ల్ 170  నియోజ‌క  వ‌ర్గాలు పెంచే ఆలోచ‌న‌లో ఉంది. అయితే కేంద్రం నుంచి పూర్తి ఆదేశాలు మాత్రం రాలేదు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం జిల్లాలు, మండ‌లాల విభ‌జ‌న మాత్రం చేసుకోవ‌చ్చు దీనికి ఎలాంటి కాల ప‌రిమితి లేదు. నియోజ‌క వ‌ర్గాల పెంపు పై మాత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు.

కేంద్రం పై బాబు ఒత్తిడి...

వీలైనంత త్వరగానే సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, న్యాయశాఖమంత్రి సదానందగౌడలతో కూడా ఆయన భేటీ అయ్యారు. కాక‌పోతే...పూర్తిస్థాయిలో అసెంబ్లీ నియోజ‌క వర్గాల విభ‌జ‌న విష‌యంలో ఇంత వ‌ర‌కు ఓ క్లారిటీ రాలేదు. వాస్త‌వానికి నియోజ‌క వ‌ర్గాల‌ను పెంచాలంటే రెండే మార్గాలున్నాయి. అందులో  ఒక‌టి, ఏపీ రీ ఆర్గ‌నైజేన్ బిల్లు ను స‌వ‌రించాలి. ఈ బిల్లు గట్టేక్కాలంటే రాజ్య‌స‌భ లో కాంగ్రెస్ స‌హ‌కరించాల్సిందే. అయితే దీనికి కాంగ్రెస్ సిద్దంగా లేదు. మ‌రోదారి ఏమిటంటే... రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయ‌డం. 2026 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా నియోజ‌క వ‌ర్గాల‌ను పెంచొద్ద‌ని  ఆర్టిక‌ల్ 170 క్లాజ్ 3 చెబుతుంది. అయితే ఈ లోపు లో నియోజ‌క వర్గాలు పెంచాలంటే... రాజ్యాంగ స‌వ‌ర‌ణ త‌ప్ప‌ని స‌రి. అయితే ఈ విధానాన్ని ఎంచుకునేందుకు బీజేపీ రెడీ గా లేదు. అందుకే కేంద్ర స‌ర్కార్ నోటితో నో అని చెప్ప‌కుండా కాలం వెళ్ళదీస్తోంది.  

ఆప‌రేష‌న్ ఆకర్ష్ తో భారీ చేరిక‌లు...

దీంతో ఏపీ సీఎం, టీడీపీ నేత చంద్ర‌బాబు డైలమాలో ప‌డ్డారట‌. ఇప్పటికే ఏపీలో అతి పెద్ద పార్టీ గా టీడీపీ నిలిచింది. గ‌త 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చాలా మంది ప్ర‌ముఖ నాయ‌కులకు టిక్కెట్ ద‌క్క‌లేదు.గ‌తంలో ఉన్న అస‌మ్మ‌తి చంద్ర‌బాబు ఇప్ప‌టికీ వెంటాడుతుంది. తాజాగా వైకాపా నుంచి  చాలా మంది నేత‌లు సైకిలెక్కారు. వారికి సీట్ల స‌ర్ధుబాటు విష‌యంలో ఏలా చేయాల‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకు రానే వ‌చ్చింది.  జ‌మ్మ‌ల మ‌డుగు లో ఆది నారాయ‌ణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి లైన్ లో ఉంటే... నంద్యాల‌లో శిల్పా మోహ‌న్ రెడ్డి,  తాజాగా భూమా నాగి రెడ్డి వ‌చ్చారు. ఇక శ్రీశైలం లో ఏరాసు ప్ర‌తాప రెడ్డి, బుడ్డా రాజశేఖ‌ర్ రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి లు ఉండ‌గా...అద్దంకీ లో క‌ర‌ణం వెంక‌టేష్, గొట్టి పాటి లు ఉన్నారు. క‌ర్నూల్ లో టీజీ వెంకటేష్, ఎస్వీ మోహ‌న్ రెడ్డి లు ఇలా ప్రతి నియోజ‌క వ‌ర్గానికి ఒక‌రు ఇద్ద‌రు ఉన్నారు. ఇక‌పోతే... ప్ర‌ధాన ప్ర‌తి పక్ష పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ వ‌ల‌స‌ల‌ను ఆహ్వానించారు చంద్ర‌బాబు. ఆ పార్టీ లోని కీల‌క నేత‌లు టీడీపీ లోకి వ‌చ్చేశారు. 
 
అసెంబ్లీ సీట్లు పెరిగే అవ‌కాశం లేదు...

నంధ్యాల  ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి,  భూమా అఖిల ప్రియ, జ్యోతుల నెహ్రూ, విజ‌య‌వాడ పశ్చిమ‌ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, ఇలా దాదాపుగా 13 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీ లో చేరారు. ఇందులో అంద‌రూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెల‌పొందినవారే. అయితే వీరు వారి వారి నియోజ‌క వ‌ర్గాల్లో మంచి పట్టున్న నాయకులే, అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థులు సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు గట్టి పోటీతోనే ఉన్నారు. ఇది కాకుండా తాజాగా వైఎస్ఆర్ సీపీ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డంతో  ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఇప్పుడున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవ‌కాశం పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే అసెంబ్లీ సీట్లు సంఖ్య పెరుగుతుంద‌ని చెప్పి, ప‌లు పార్టీ నేత‌ల‌ను కండువా క‌ప్పారు చంద్ర‌బాబు. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డం తో పాటు రాష్ట్రంలో విప‌క్షాన్ని లేకుండా చేసే ఉద్దేశంతో అధికార పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌లేపారు. 

చంద్ర‌బాబుకు భారీ మూల్యం త‌ప్ప‌దా?

పార్టీలోకి వైకాపా ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌ద్దంటూ అధికార పార్టీకి చెందిన ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోని కార్య‌కర్తలు ప‌లు సంద‌ర్భాల్లో వ్య‌తిరేకించారు. తీరా ఇప్పుడు స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో నోరు మెద‌ప‌డం లేద‌ట చంద్ర‌బాబు.  బాబు మాట‌లు న‌మ్మి పార్టీలో చేరితే... ఇప్పుడు సీటు రాక‌పోతే త‌మ భవిష్య‌త్ ఎంటనే ఆందోళ‌న‌లో ఉన్నారట తెలుగు త‌మ్ములు. మ‌రి కొత్త‌గా వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఇంకా ఘోరంగా ఉంద‌ట‌. ఒక్కొక్క నియోజ‌క వ‌ర్గానికి ముగ్గురు న‌లుగురు పోటీ ప‌డితే మా ప‌రిస్థితేంటనీ వాపోతున్నార‌ట. అయితే నియోజ‌క వర్గాల పెంపు ప్ర‌క్రియ ఎప్ప‌టికీ ముగుస్తుందో... ఈ బిల్లు  కేంద్ర హోంశాఖ స‌భ‌లో ఎప్పుడు ప్ర‌వేశ పెడుతుందో చూడాలి మ‌రి. ఇలా 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల పెంపు కొలిక్కి రాక‌పోతే,  చంద్ర‌బాబు మాత్రం రాబోయే ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. 


మరింత సమాచారం తెలుసుకోండి: