తెలంగాణలో ఇప్పుడు రాజకీయమంతా కేసీఆర్ కు అనుకూలంగా సాగిపోతోంది. రాష్ట్రంలోని ప్రధాన నాయకులంతా ఆయన పార్టీలోకే క్యూ కడుతున్నారు. ప్రతిపక్షం అన్నది నామమాత్రంగా మారిపోయింది. ఒకరిద్దరు నేతలు తప్పు అంతా కేసీఆర్ భజనలో మునిగి తేలుతున్నారు. 

ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే అతి తక్కువ మంది నేతల్లో రేవంత్ రెడ్డి ఒకరు. తెలంగాణ శాసనసభలో టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం దూకుడు తగ్గించడం లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ గా ఉన్నా.. మళ్లీ తాజాగా మల్లన్నసాగర్ భూముల వివాదంతో మరోసారి ఫామ్ లోకి వచ్చారు. 


సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాకపోతే విమర్శల డోసు బాగా పెరిగిపోవడంతో చిక్కుల్లో పడ్డారు. విషయంపై విమర్శలు చేయడంతో సరిపెట్టకుండా.. అమరావతి వెళ్లి బిర్యానీ తిన్న గాడిద ఎవరు.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు 56 వేల కోట్లు దోచిపెట్టిందెవరు అంటూ ఘాటుగా విమర్శించారు. ఇప్పుడీ కామెంట్లు రేవంత్ ను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. 

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై పోలీసులు సెక్షన్ 508 తో సహా వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో కేసు నమోదైంది. మరి దీనిపై చర్యలు ఎలా ఉంటాయో..ఏదేమైనా తిట్ల భాషతో కాకుండా కంటెంట్ తో రేవంత్ విమర్శిస్తే బావుంటుందేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: