అమరావతిలోని సదావర్తి భూముల కుంభకోణంపై విమర్శలు వస్తున్నాయి. ఈ భూములను అతి తక్కువ ధరకు టీడీపీ నేత కాపు కార్పొరేషన్ కు కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిజనిర్దారణ కోసం చెన్నై వెళ్లిన వైసీపీ బృందం ఈ కుంభకోణంలో లోకేశ్ పాత్రపై ఆరోపణలు గుప్పించింది. 

మాజీమంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతో పాటు క‌మిటీలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ అధ్య‌క్షులు కూడా చెన్నై వెళ్లారు. సదావర్తి సత్రం భూములపై నిజనిర్ధారణ కమిటీ నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అందజేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ధర్మాన అంటున్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాత్ర ఉందని ధర్మాన ఆరోపించారు. 


లోకేశ్ పాత్ర ఉండటం వల్లే చంద్రబాబు ఈ ఇష్యూపై ఇంతవరకూ మాట్లాడలేదని ధర్మాన ఆరోపించారు. సదావర్తి సత్రం భూములను టీడీపీ నేతలు అక్రమంగా కొట్టేశారని విమర్శించారు. ఈ భూముల విషయంలో వెయ్యి కోట్లకు పైగా దోపిడికి జరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోందని ధర్మాన అన్నారు. 

సదావర్తి సత్రం పరిధిలో ప్రభుత్వ ధర ఎకరాకు రూ.6.5కోట్లు ఉంటే మీరు ఎకరాకు రూ.27లక్షలకే ఎలా కట్టబెడతారని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఈ విషయంపై ఇంతవరకూ దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు నిలదీశారు. సత్రం భూముల వేలాన్ని రద్దు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని వైసీపీ నేతలు అంటున్నారు. మరీ మరోసారి వేలానికి చంద్రబాబు ఒప్పుకుంటారా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: