బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి లిద్దరూ తోడుదొంగలేనని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే వారికి మనుగడ ఉండదని భావించి తమకు అడ్డుపడుతున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై నాగం జనార్దన్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీ వేషాలు మార్చుకోకపోతే ప్రజలు ఛీ కొడతారని టీడీపీ, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డిలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టుని ఆపాలని మహానాడులో చంద్రబాబు తీర్మానం చేస్తే అడ్డుకోని రేవంత్‌రెడ్డి... మల్లన్నసాగర్ వద్దకు వెళ్లి దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు.



ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని, నాగం, రేవంత్‌కు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలు అమాయకులు కాదని, వేషాలన్నీ గమనిస్తూనే ఉన్నారని, తీరు మార్చుకోకుంటే చితుకబాదుతారని హెచ్చరించారు. ప్రాజెక్టులు పూర్తై రాజకీయ మనుగడ ఉండదనే భయంతోనే ఇలా చేస్తున్నారు. కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా తదితర ప్రాజెక్టులకు 2004 నుంచి ఇప్పటి వరకు భూసేకరణ జరగలేదు. భూసేకరణ సమస్యతోనే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుంది. ఆగస్టులో 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం’ అని మంత్రి చెప్పారు.



రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న నాగం, రేవంత్‌రెడ్డి తమ జిల్లాలో ఎట్లా పుట్టారని ప్రజలు బాధపడుతున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మహానాడులో తీర్మా నం చేస్తే చప్పట్లు కొట్టారన్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు లేఖలు రాస్తుంటే.. రేవంత్‌రెడ్డి ఆంధ్రలో కాంట్రాక్టులు చేసుకుంటూ ఇక్కడ పిట్టదొరలా ఎగిరిపడుతున్నాడన్నారు. రేవంత్ దీక్ష వెనక కచ్చితంగా బాబు హస్తం ఉందని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: