జడ్జీల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. హైకోర్టు విభజన మొదలుకొని జడ్జీల నియామకం వరకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన భావిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని భావిస్తున్న కేసీఆర్‌ దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, సీనియర్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు.



తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు న్యాయాధికారుల కేటాయింపు వ్యవహారం సోమవారం ఊహించని మలుపు తిరిగింది. గన్‌పార్క్‌నుంచి రాజ్‌భవన్‌కు న్యాయాధికారులు పాదయాత్రగా వెళ్లడం, కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించడాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు ఇందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు తెలంగాణ జడ్జీల సంఘం నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. 



తమకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపినందుకు ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా స్పందించడంపై తెలంగాణ న్యాయాధికారులు భగ్గుమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించడమే నేరమా? నిబంధనలు పాటించాలని కోరడమే ఘోరమా? క్రమశిక్షణ పేరిట గొంతు కోస్తారా? అని మండిపడ్డారు. సహచర జడ్జీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జడ్జీలు సామూహికంగా సెలవులు పెట్టాలని నిర్ణయించారు.



న్యాయాధికారుల సస్పెన్షన్‌ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు తెలిపారు. న్యాయాధికారుల సస్సెన్షన్‌ నిర్ణయాన్ని ఖండించింది. వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ న్యాయాధికారులకు వ్యతిరేకంగా, పక్షపాతంతో వ్యవహరిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలేను వెనక్కి పిలిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి విజ్ఞప్తి చేసింది. సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతోపాటు ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకునేదాకా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో విధులను బహిష్కరించాలని తీర్మానించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బదిలీ సమయంలో ఎలాంటి వీడ్కోలు ఏర్పాటు చేయరాదంటూ తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌కు విజప్తి చేసింది. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. న్యాయాధికారులను సస్పెన్షన్‌ను ఖండిస్తూ, ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన ఆరుగురు బార్‌కౌన్సిల్‌ సభ్యులు ప్రకటన విడుదల చేశారు.



కేంద్ర నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు, తెలంగాణ న్యాయాధికారులకు, ప్రజలకు న్యాయం జరిగేందుకు దిల్లీ కేంద్రంగా ఆందోళన చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి దిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన ఈ ఆందోళనకు పూనుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: