మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు, దుంగార్పూర్‌ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ల వివాహం సోమవారం వైభవంగా జరిగింది. రాజమందిరంలోని కల్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజవంశీయులు పాల్గొన్నారు.బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న 24 ఏళ్ల యదువీర 22 ఏళ్ల త్రిషికా కుమారిని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లాడారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పుర్ రాజవంశానికి చెందిన హర్షవర్థన్ సింగ్, మహేశ్రీకుమారి కూతురు త్రిషికా కుమారి. రాచరిక వైభవాన్ని తలపిస్తూ.. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సంప్రదాయ రాజరిక దుస్తులు, తలపాగా ధరించిన వరుడు యుదవీర వధువు త్రిషికా పరస్పరం దండలు మార్చుకున్నారు.



ఆరు వందల మందికి మాత్రమే ఆహ్వానాలను పరిమితం చేశారు. రాజవంశ సంప్రదాయాల ప్రకారం వివాహం నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి వివిధ ధార్మిక కార్యక్రమాల్ని చేపట్టారు. ఉదయం 10.24 గంటల సమయంలో మంగళసూత్ర ధారణ జరిగింది. సంప్రదాయాలకు ఎలాంటి భంగం రాకుండా రాజమాత ప్రమోదాదేవి స్వయంగా వేడుకల్ని పర్యవేక్షించారు. వివిధ ఆలయాల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాల్ని అర్చకులు నూతన దంపతులకు సమర్పించారు. రాజసంప్రదాయం ప్రకారం వారికి కానుకల్ని అందచేశారు. దాదాపు మూడు గంటల పాటు వేడుకలు జరిగాయి. మంగళవారం దర్బార్‌ హాల్‌లో విందు ఉంటుంది.



ఈ వివాహ కార్యక్రమాలకు మేవాడ, జైపుర,జోధ్‌పుర, రాజపుత్, భరతపుర, గ్వాలియర్, కిసన్‌నగర, ఖల్విపుర, ఛత్తరపుర, రామాపుర,రఘోఫర్, సింధ్యా రాజవంశాలకు చెందిన వారిని ఆహ్వానించారు. మైసూరు రాజవంశస్థులు ఆచారం ప్రకారం వధూవరులను ఏనుగు అంబారిపై  ఊరేగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్యాలెస్‌లో కారులోనే వధూవరులను ఊరేగించనున్నట్లు రాజమాత ప్రమోదాదేవి తెలిపారు. యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా సింగ్ కుమారిల వివాహ మహోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ విద్యుత్ దీపాలతో కాంతిలీనుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: