తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రాన్ని విమర్శించడం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, కేసీఆర్ లతో తాను చర్చలు జరిపానని ఆయన అన్నారు. ఏపీలో హైకోర్టుకు అవసరమైన మౌలిక వసతులు లేవని, తెలంగాణలో మరో ప్రాంతంలో హైకోర్టును నిర్వహించేందుకు మౌలిక వసతులు కల్పించలేదని ఆయన గుర్తు చేశారు.


జంతర్‌మంతర్‌ వద్ద ఆయన ధర్నా చేయదలచుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌లా కేంద్రాన్ని విమర్శిస్తూ ధర్నాలు చేస్తే ప్రజలే ఆయనకు సమాధానం చెబుతారని అన్నారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్‌ వ్యవహారాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈరోజు సదానండగౌడను కలిసి వివరించారు. హైకోర్టు విభజన అంశం ఉమ్మడి హైకోర్టులో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించలేనని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.



ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులను చంద్రబాబు సర్కారు కల్పించిన పక్షంలో వెంటనే మారుస్తామని అన్నారు. నిజానిజాలు గుర్తించకుండా కేసీఆర్ తమను విమర్శిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజనకు సిద్ధంగా ఉన్నా, తమనే విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: