తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు తీపి కబురు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ. లక్ష, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.50 వేలు, గత రెండేళ్ల కాలంలో పలు కారణాల వల్ల ఆకస్మికంగా మరణించిన జర్నలిస్టు కుటుంబసభ్యులకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పెన్షన్ అందించనుంది. వీటితో పాటు ప్రముఖ యూనివర్శిటీలలో జర్నలిజం కోర్సు చదివే జర్నలిస్టుల పిల్లలకు రెండు లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ జీవో విడుదల చేశారు.



రాష్ట్రంలో జర్నలిస్టు ఫ్రెండ్లీ ప్రభుత్వం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, వారికి అండగా నిలుస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.


 రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులను అందజేస్తున్నదని, ఉద్యోగులకు కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్య సౌకర్యం కల్పించడం లేదనే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపు అంశంపై జూలై నెలాఖరున గానీ, ఆగస్టు తొలివారంలో గానీ సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: